Let's talk: editor@tmv.in
త్వరలో లంబసింగికి రానున్నకుంకుమ పువ్వు

త్వరలో లంబసింగికి రానున్నకుంకుమ పువ్వు

Dantu Vijaya Lakshmi Prasanna
5 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచేలా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యం

ఈసమీక్షలో రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టి, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

ప్రస్తుతం 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీనిని 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులకు, 50 లక్షల ఎకరాలకు విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని తెలిపారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెంచేందుకు ఏప్రిల్ నాటికి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

కీలక ప్రాజెక్టులు: కోకో సిటీ, కుంకుమ పువ్వు సాగు

రాష్ట్రంలోని ఉద్యానవన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం సరికొత్త ప్రణాళికలు వెల్లడించారు.

ఏలూరులో కోకో సిటీ:

ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో 'కోకో సిటీ' ఏర్పాటు కానుంది. ఇక్కడ కోకో సాగుతో పాటు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయని చంద్రబాబు అన్నారు.

లంబసింగిలో కుంకుమ పువ్వు:

ఆంధ్ర కాశ్మీర్‌గా పిలిచే చింతపల్లి (లంబసింగి) ప్రాంతంలో గిరిజనుల భాగస్వామ్యంతో పిపిపి (పబ్లిక్, ప్రయివేట్ పార్ట్నర్ షిప్) పద్ధతిలో కుంకుమ పువ్వు సాగును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించనున్నామని సిఎ౦ తెలిపారు.

సాంకేతిక విప్లవం: మూడు సరికొత్త యాప్‌ల ఆవిష్కరణ

వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడిస్తూ సీఎం చంద్రబాబు మూడు యాప్‌లను ప్రారంభించారు

డిజి రైతు బజార్ యాప్:

ఈ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లో కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది.

ఏపి ఎయిమ్స్ యాప్:

ఈ యాప్ రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్ల బుకింగ్ కోసం ఉపయోగపడనుంది.

కిసాన్ డ్రోన్ యాప్:

డ్రోన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిసాన్ డ్రోన్ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9,512 యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉంచారు.

ఇతర ముఖ్యమైన నిర్ణయాలు:

ఆక్వా రంగంలో ఆక్వా సాగు చేసే రైతులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పౌల్ట్రీ బలోపేతం కోసం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టులను దళారులకు కాకుండా నేరుగా పౌల్ట్రీ రైతులకే ఇవ్వాలని నిర్ణయించారు. కుప్పం ఫ్లవర్ ఫెస్టివల్ తరహాలో వివిధ ప్రాంతాల్లో పంటల ప్రాముఖ్యతను తెలిపేలా 'అగ్రి ఫెస్టివల్స్' (క్రాప్ ఫెస్టివల్స్) నిర్వహించి పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు.

అరటి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉన్నా ఎగుమతుల్లో వెనుకబడి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. అమెరికా, యూరప్ దేశాలకు రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి ఎగుమతులు పెంచేందుకు కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

ఈసమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఏపీ వ్యవసాయ రంగం పూర్తి డిజిటల్, ప్రకృతి సిద్ధంగా మారబోతోందని ఈ సమీక్ష స్పష్టం చేస్తోంది.

త్వరలో లంబసింగికి రానున్నకుంకుమ పువ్వు - Tholi Paluku