Let's talk: editor@tmv.in
త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Panthagani Anusha
9 ఫిబ్రవరి, 2026

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనం పనులు వేగంగా సాగుతున్నాయని త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్‌మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఆయన విమానాశ్రయాన్ని సందర్శించి, టెర్మినల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి మార్చి 31లోపు పూర్తిచేయాలని అధికారులకు కాంట్రాక్టర్ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆధునిక మౌలిక వసతులతో నూతన టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ టెర్మినల్ ప్రారంభం ద్వారా ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు, రాజమండ్రి విమానాశ్రయంలో ప్రయాణ అనుభూతి మరింత మెరుగుపడనుందని మంత్రి పేర్కొన్నారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయ అభివృద్ధి చేపడుతున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, గోదావరి ప్రాంత ప్రజలకు ఈ విమానాశ్రయం కీలక గేట్‌వేగా మారేలా అభివృద్ధి జరుగుతోందని నూతన టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతం కావడంతో పాటు, పర్యాటకం ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే రాజమండ్రికి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.

అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో “ఏక్ పెడ్ మా కే నామ్ సే” కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, విమానాశ్రయ డైరెక్టర్ ఎన్.కే. శ్రీకాంత్, టెర్మినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రామాచారి, ఇంజనీర్ ప్రీతా, ప్రాజెక్ట్ డీజీఎంలు వి. శ్రీనివాస్, ఆర్.ఎస్.ఎం. మూర్తితో పాటు ఇతర ఇంజనీరింగ్, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.