
త్వరలో న్యూఢిల్లీ నుంచి బ్రెజిల్‌కు విమాన సర్వీస్
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా భారత పర్యటన ఫలితాలు అసాధారణంగా ఉన్నాయని అపెక్స్ బ్రెజిల్ అధ్యక్షుడు జార్జ్ వియానా తెలిపారు. భారత్–బ్రెజిల్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేలా పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. న్యూఢిల్లీలో ఆదివారం వియానా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే న్యూఢిల్లీ నుంచి బ్రెజిల్‌కు నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఒక స్టాప్ ఉండవచ్చు అని వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
భారీగా హాజరైన వ్యాపారవేత్తలు
ఈ పర్యటనలో 300 మందికి పైగా బ్రెజిలియన్ వ్యాపారవేత్తలు, భారత వైపు నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని వియానా తెలిపారు. న్యూఢిల్లీలో అపెక్స్‌బ్రెజిల్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. బ్రెజిలియన్ ఉత్పత్తులు భారత ప్రధాన రిటైల్ చైన్‌లలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. న్యూఢిల్లీ, ముంబైలోని ప్రముఖ సూపర్ మార్కెట్లలో బ్రెజిల్‌కు చెందిన జీడిపప్పు, ఆసాయి, నిమ్మ వంటి ఉత్పత్తులు 40 దుకాణాల్లో విక్రయించనున్నట్లు వెల్లడించారు.
టాటా గ్రూప్‌తో సమావేశం
నటరాజన్ చంద్రశేఖరన్ సమన్వయంతో బ్రెజిల్ అధ్యక్షుడు ప్రముఖ భారత పారిశ్రామిక వర్గాలతో సమావేశమయ్యారని వియానా తెలిపారు. టాటా గ్రూప్ ఇటాలియన్ సంస్థ ఎల్వీసో కొనుగోలు అనంతరం బ్రెజిల్‌లో వాహన ఉత్పత్తి విస్తరణకు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. బ్రెజిల్‌లో ఐవెకో కార్యకలాపాల విలువ సుమారు 1 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.
పెట్టుబడులకు బ్రెజిల్ సిద్ధం
కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో సహకారంతో పాటు, రాజకీయ స్థాయిలో జరిగిన చర్చలు వ్యాపార వాతావరణాన్ని బలోపేతం చేశాయని అన్నారు. చట్టపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వంతో బ్రెజిల్ పెట్టుబడులను స్వాగతించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయని వియానా విశ్వాసం వ్యక్తం చేశారు.
బ్రెజిల్ ట్రేడ్ ప్రోత్సాహ సంస్థ ‘అపెక్స్ బ్రెజిల్’ పాత్ర కీలకం
బ్రెజిల్ ప్రభుత్వానికి చెందిన ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోత్సాహ సంస్థ అపెక్స్ బ్రెజిల్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయ కంపెనీలకు విదేశీ మార్కెట్లలో అవకాశాలు కల్పించడం, ఎగుమతులను పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.అపెక్స్ బ్రెజిల్, బ్రెజిల్ ఉత్పత్తులకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. అంతర్జాతీయ ప్రదర్శనలు, వ్యాపార సదస్సులు, బిజినెస్ మీటింగ్స్ నిర్వహిస్తూ బ్రెజిల్ వ్యాపార సంస్థలకు ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానం కల్పిస్తోంది. అదే సమయంలో విదేశీ పెట్టుబడులను బ్రెజిల్‌లోకి ఆకర్షించేందుకు ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహ కార్యక్రమాలు అమలు చేస్తోంది. పెట్టుబడిదారులకు సమాచారం, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక సహాయం అందిస్తోంది. మొత్తంగా చూస్తే, బ్రెజిల్ ఎగుమతుల పెరుగుదలతో పాటు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో కీలక సంస్థగా నిలుస్తోంది.
