Let's talk: editor@tmv.in
త్వరలో దేశవ్యాప్తంగా 'ఎస్‌ఐఆర్‍'

త్వరలో దేశవ్యాప్తంగా 'ఎస్‌ఐఆర్‍'

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్‌ఐఆర్‍) కార్యక్రమాన్ని దశలవారీగా చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని ఈసీ నిర్వహించదు. ఎందుకంటే అక్కడి క్షేత్రస్థాయి ఎన్నికల యంత్రాంగం ఆ పనులతో బిజీగా ఉండి ఎస్‌ఐ‌ఆర్‌పై దృష్టి పెట్టకపోవచ్చని తెలిపారు.

2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు, మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి దశలో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్‌లో ఎస్‌ఐఆర్‍ ప్రక్రియ ముగిసింది. అక్కడ దాదాపు 7.42 కోట్ల మంది పేర్లతో కూడిన తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్‍ను ప్రారంభించే పని జరుగుతోందని, ప్రారంభంపై తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని సీఈసీ తెలిపారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, జూన్ 24న బీహార్ ఎస్‌‌ఐఆర్‌ను ప్రారంభించేటప్పుడే దేశవ్యాప్త ఎస్‌ఐఆర్ ప్రణాళికను ఈసీ ప్రకటించిందని సీఈసీ గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌లను ప్రారంభించే తేదీలను నిర్ణయించడానికి ముగ్గురు కమిషనర్లు త్వరలో సమావేశమవుతారని ఆయన తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక సమావేశంలో సీఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులను రాబోయే 10 నుండి 15 రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని కోరింది. తమ రాష్ట్రాల్లోని గత ఎస్‌ఐఆర్ తర్వాత ప్రచురించబడిన ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనేక మంది సీఈఓలు తమ చివరి ఎస్ఐఆర్ తర్వాత ప్రచురించిన ఓటర్ల జాబితాలను తమ వెబ్‌సైట్లలో ఉంచారు.

ఢిల్లీ సీఈఓ వెబ్‌సైట్‌లో, జాతీయ రాజధానిలో చివరి ఇంటెన్సివ్ సవరణ జరిగిన 2008 నాటి ఓటర్ల జాబితా ఉంది. ఉత్తరాఖండ్‌లో చివరి ఎస్ఐఆర్ 2006లో నిర్వహించగా.. ఆ సంవత్సరం ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

చాలా రాష్ట్రాల్లో చివరి ఎస్‌ఐఆర్ 2002 నుంచి 2004 మధ్య జరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ప్రస్తుత ఓటర్లను రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో చివరి ఎస్‌ఐఆర్ ప్రకారం ఉన్న ఓటర్లతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి. అక్రమ వలసదారులను తొలగించడం, ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే ఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యమని ఈసీ పేర్కొంది.

త్వరలో దేశవ్యాప్తంగా 'ఎస్‌ఐఆర్‍' - Tholi Paluku