
త్వరలో గల్ఫ్ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు:
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని ప్రపంచస్థాయి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిరుపతి విమానాశ్రయంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్ గారితో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ పురోగతి ప్రయాణికుల సౌకర్యాలు భవిష్యత్తు విస్తరణ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి విమానాశ్రయం చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో పది లక్షల మంది ప్రయాణికుల మార్కును దాటడంపై మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన 'కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్' విజన్‌లో భాగంగా తిరుపతిని ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే రాయలసీమ మరియు నెల్లూరు ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల వలస కార్మికులు, పర్యాటకులు ఇతర నగరాల మీదుగా కాకుండా తిరుపతి నుంచే నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుందన్నారు. విమానాశ్రయానికి వచ్చే భక్తులకు పవిత్ర అనుభూతిని కలిగించేలా టెర్మినల్ లోపల స్థానిక కళారూపాలు, సాంస్కృతిక అంశాలతో అలంకరించాలని సూచించారు. జనరల్ ఏవియేషన్ టెర్మినల్ ప్రారంభంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
