
త్వరలో ‘గరుడ’ పథకానికి శ్రీకారం: మంత్రి సవిత
రాష్ట్రంలోని నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన ‘గరుడ’ పథకాన్ని పునరుద్ధరిస్తూ త్వరలోనే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరాంప్రసాద్ ఎండీ చిన్నబాబుతో కలిసి మంత్రి ఈ పథకం విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద బ్రాహ్మణులు మృతి చెందితే వారి అంతిమ సంస్కారాల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆమె పేర్కొన్నారు.
బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట
బ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2014లోనే చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ సమయంలో భారతి, గాయత్రి, వేదవ్యాస, చాణక్య, కల్యాణమస్తు వంటి పది రకాల పథకాలను అమలు చేశామని అయితే గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణులకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే అర్చకుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొంటూ దీనిలో భాగంగా ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకుల గౌరవ వేతనాన్ని రూ. 3,000 నుంచి రూ. 7,000లకు పెంచడమే కాకుండా ధూప దీపాల ఖర్చుల కోసం మరో రూ. 3,000లను కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని తెలిపారు. అదేవిదంగా రూ. 50 వేల లోపు ఆదాయం కలిగిన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ. 10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామని ఆమె వెల్లడించారు. వీటితో పాటు నిరుద్యోగ వేద పండితులకు చేదోడుగా ఉండేందుకు ‘సంభావన’ పేరుతో నెలకు రూ.3,000ల నిరుద్యోగ భృతిని కూడా అందజేస్తున్నామని మంత్రి వివరించారు.
త్వరలోనే స్వయం ఉపాధి పథకాల కింద కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని బ్రాహ్మణులందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.
అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విధాన ప్రాధాన్యతలు మారడంతో గరుడ పథకం సహా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం తమ పథకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన కార్పొరేషన్ ఆధారిత పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగలేదని సమాచారం. అదేవిదంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు పరిపాలనా అనుమతులు ఆలస్యం కావడం కూడా ఈ పథకం అమలు నిలిచిపోవడానికి కారణమైంది. పథకాల సమీక్ష పేరుతో పాత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించకుండా సామూహిక సంక్షేమ పథకాలకే పరిమితమయ్యారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నిలిచిపోయిన గరుడ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తూ పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు.
