Let's talk: editor@tmv.in
త్వరలో ‘కోర్ అర్బన్ చట్టం’: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో ‘కోర్ అర్బన్ చట్టం’: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
1 మార్చి, 2026

భాగ్యనగర పాలనలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగురోడ్డు పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా, ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో నూతనంగా ‘కోర్ అర్బన్ చట్టం’ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన మున్సిపల్ శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అనుమతులు, నిర్వహణకు ఒకే చట్టం

కోర్ అర్బన్ ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అన్ని అంశాలకు ఈ నూతన చట్టమే ప్రాతిపదికగా ఉండాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయ‌న పేర్కొన్నారు. కోర్ అర్బన్ ప్రాంతంలో, చెత్త ఎక్కడ వేయాలో స్పష్టత లేక ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్న సమస్యను పరిష్కరించేందుకు ముందుగా చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రోడ్ల నిర్మాణంలో నిర్దేశిత కాలం పాటు మన్నికగా ఉండే ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అవి పనిచేస్తున్నాయా లేదా అన్న సమాచారం డ్యాష్‌బోర్డులో ప్రత్యక్షంగా కనిపించేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా లోపం తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయ‌న‌ చెప్పారు.

ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నగరంలోని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, హోటళ్లలో ఆహార భద్రత చర్యలను సమీక్షించాలని పేర్కొన్నారు. అలాగే 50 అంతస్తులకు పైగా భవనాలు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై దృష్టి సారించి ఆధునిక అగ్నిమాపక పరికరాలు, సాంకేతికతను సమకూర్చుకోవాలని సూచించారు.

నగర కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని సేకరించాలని, ఆర్ అండ్ బీ సహా ఇతర శాఖల పరిధిలోని రోడ్లన్నింటిని మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. రద్దీ తగ్గించేందుకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను పరిశీలించి సూచనలు చేశారు. చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని, నగరంలోని పెద్ద చెరువులు, కుంటల సంరక్షణతో పాటు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.