Let's talk: editor@tmv.in
త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేయబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలోనే “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0” విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి భరోసా కల్పించే విధంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.ఈ ప్రక్రియలో పారిశ్రామికవేత్తలు, నిపుణులు, వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాప్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన “గ్రోత్ ఎక్స్ 2026” సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధి అనేది యాదృఛ్చికంగా సంభవించేదేమీ కాదని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047ను రూపొందించిందని మంత్రి తెలిపారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ల‌క్ష్యం

ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ దిశగా “క్యూర్, ప్యూర్, రేర్” అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. నగరాల నుంచి గ్రామాల వరకు సమగ్ర అభివృద్ధి సాధించడం, అన్ని ప్రాంతాలను వృద్ధి మార్గంలో నడిపించడం ప్రభుత్వ అజెండా అని వివరించారు.

ఇండస్ట్రీ 5.0 ఎకో సిస్టమ్

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ, ఇండస్ట్రీ 5.0 వంటి సాంకేతిక పరిణామాలు వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చుతున్నాయని, భవిష్యత్తులో కంపెనీలకంటే బలమైన ఎకోసిస్టమ్‌లకే అధిక ప్రాధాన్యం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా, దానిని నిర్మించడమే తమ ధ్యేయమని అన్నారు. పరిశ్రమలకు కేవలం అనుమతులు జారీ చేసే వ్యవస్థగా కాకుండా, వారితో కలిసి నడిచే భాగస్వామిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ ప్రపంచానికే ఆదర్శం:రామ‌చందర్ రావు

'గ్రోత్ ఎక్స్ 2026' సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పాల్గొని ప్రసంగించారు. స్టార్టప్‌లు, పరిశ్రమలు మరియు ప్రభుత్వ విధానాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ సదస్సు ఒక గొప్ప వేదిక అని ఆయన కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లో డిజిటల్ విప్లవం రూపుదిద్దుకుంటోందని వివరించారు.రూ.10,300 కోట్ల కేటాయింపుతో అమలవుతున్న ఇండియన్ ఏఐ మిషన్ ద్వారా శక్తివంతమైన ఏఐ మౌలిక వసతులు, ఆవిష్కరణలు, భవిష్యత్‌కు సిద్ధమైన ప్రతిభను తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతోందన్నారు. అలాగే రూ.76,000 కోట్ల అవుట్‌లేతో అమలవుతున్న ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ భారత్‌ను గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా నిలబెడుతోందని, దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తున్నదని ఆయ‌న పేర్కొన్నారు.

2014లో కేవలం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌లు, నేడు 2 లక్షలకు పైగా పెరిగి భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా నిలబెట్టాయి.కేవలం 4 గా ఉన్న యూనికార్న్ల సంఖ్య ప్రస్తుతం 125కు చేరింది. 2025లోనే 44,000 కొత్త స్టార్టప్‌లు నమోదు కావడం గొప్ప విషయమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా. నాగేశ్వర్ రెడ్డి, ఫ్యాప్సీ అధ్యక్షుడు ఆర్. రవి కుమార్, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేసిన వేదికగా నిలిచింది.