Let's talk: editor@tmv.in
త్వరలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో క్వాంటం టెక్నాలజీ కోర్సులు: ముఖ్యమంత్రి

త్వరలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో క్వాంటం టెక్నాలజీ కోర్సులు: ముఖ్యమంత్రి

Dantu Vijaya Lakshmi Prasanna
25 డిసెంబర్, 2025

ఆధునిక నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు త్వరలోనే పాఠశాలల్లో క్వాంటం టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో వస్తున్న సరికొత్త అవకాశాలను అందుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

"యువతకు నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్ అందించేందుకు రాష్ట్రంలో త్వరలో క్వాంటం టెక్నాలజీ కోర్సులను ప్రారంభిస్తాం" అని ముఖ్యమంత్రి అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుండే క్వాంటం టెక్నాలజీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐ అవగాహన:

తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించే ప్రతిపాదనలను ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు వివరించారు. 2026 నుండి ప్రారంభించి, రెండేళ్లలో నాలుగు దశల్లో విద్యార్థులకు నిర్మాణాత్మకమైన ఏఐ ఓరియంటేషన్ అందించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా 7, 8, 9వ తరగతి విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీలో ప్రవేశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్పిటిఇఎల్ ప్లాట్‌ఫారమ్‌ను క్వాంటం స్కిల్స్ అప్‌గ్రేడ్ కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. 50,000 మందికి పైగా టెక్ విద్యార్థులకు క్వాంటం శిక్షణ ఇవ్వాలని, జనవరి 2026 చివరి నాటికి కరికులం (పాఠ్య ప్రణాళిక) పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్టూడెంట్ పార్ట్‌నర్‌షిప్ సమిట్:

విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు వీలుగా 2026 జనవరి చివరిలో 'స్టూడెంట్ పార్ట్‌నర్‌షిప్ సమిట్' నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రం నాలెడ్జ్ హబ్‌గా మారుతున్న తరుణంలో, విద్యార్థులు ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చారిత్రాత్మక క్వాంటం లెక్చర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం స్కిల్లింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 50,000 మందికి పైగా విద్యార్థులకు తన క్వాంటం విజన్‌ను ముఖ్యమంత్రి వివరించారు. సిలికాన్ వ్యాలీ తరహాలోనే భవిష్యత్ నాలెడ్జ్ ఎకానమీకి ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ కేంద్రం కానుందన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోనే క్వాంటం కంప్యూటర్ల తయారీ ప్రారంభం కానున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం టెక్నాలజీపై ఒక దిశానిర్దేశం చేసే ప్రసంగాన్ని అందించారు. దీని ద్వారా రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా క్వాంటం టెక్నాలజీపై ఉపన్యాసం ఇవ్వడం ఇదే తొలిసారి.

అమరావతి క్వాంటం వ్యాలీని బలోపేతం చేయడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న క్వాంటం శ్రామిక శక్తిని నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీనిని వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ రీసెర్చ్), భారతదేశ భాగస్వామిగా ఉన్న క్యూబిటెక్ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. కేవలం 10 రోజుల్లోనే 50,000 మంది విద్యార్థులు దీని కోసం నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 51 శాతం మంది మహిళలు ఉండటం ఈ కార్యక్రమం యొక్క సమ్మిళిత స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ వేదికపై ముఖ్య మంత్రి మాట్లాడుతూ, సిలికాన్ వ్యాలీ టు క్వాంటం వ్యాలీ: "25 ఏళ్ల క్రితం నేను ఐటీ విజన్‌ను అందించాను. ఈరోజు క్వాంటం విజన్‌ను మీ ముందు ఉంచుతున్నాను. డిజిటల్ యుగానికి సిలికాన్ వ్యాలీ ఎలాగో, భవిష్యత్ నాలెడ్జ్ ఎకానమీకి అమరావతి క్వాంటం వ్యాలీ అలా మారుతుంది" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. చారిత్రక సంస్కరణలైన 1991 ఆర్థిక సంస్కరణలు, టెలికాం రంగంలో వచ్చిన మార్పులు భారతదేశ నాలెడ్జ్ ఎకానమీని ఎలా మార్చాయో ఆయన వివరించారు. హైటెక్ సిటీ స్థాపన వల్ల తెలుగు యువత ప్రపంచ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు.

మేక్ ఇన్ ఏపీ నినాదంతో దేశంలోని మొబైల్ ఫోన్లలో 99.2 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయని, ప్రతి ఐదు హ్యాండ్‌సెట్‌లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుతోందని ఆయన గర్వంగా చెప్పారు. ప్రపంచ వేదికపై, అలాగే అమెరికాలో తెలుగు వారు ఆర్థికంగా ఎంతో ఎత్తులో ఉన్నారని, సిలికాన్ వ్యాలీలో 1,200కు పైగా స్టార్టప్‌లను తెలుగు వారు స్థాపించారని, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో కీలక బాధ్యతల్లో ఉన్నారని ఆయన కొనియాడారు.

క్వాంటం కంప్యూటర్ల తయారీలో భాగంగా ఐటీ, ఏఐ తర్వాత తదుపరి విప్లవం క్వాంటం కంప్యూటింగ్‌దేనని, వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం కంప్యూటర్ల తయారీని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుండి క్వాంటం సైన్స్‌లో మొదటి నోబెల్ బహుమతి సాధించిన వారికి 100 కోట్ల రూపాయల నగదు బహుమతిని సీఎం ప్రకటించారు. క్వాంటం ఫర్ ఆల్: గతంలో "ఇంటికో ఐటీ ఉద్యోగి" అన్న నినాదం లాగే, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

"ప్రొడక్ట్ (ఉత్పత్తి) ఆవిష్కరణలే భవిష్యత్తు" అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక మార్గదర్శిగా నిలుస్తుందని, తెలుగు యువత ప్రపంచ సంపద సృష్టికర్తలుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ అభయ్ కరాండికర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

త్వరలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో క్వాంటం టెక్నాలజీ కోర్సులు: ముఖ్యమంత్రి - Tholi Paluku