Let's talk: editor@tmv.in
త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా హుస్నాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయ్యేలోగా మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విపులంగా వివరించారు. హుస్నాబాద్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్లు చెప్పారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయ‌న‌ ప్రకటించారు. ఈ ప్రాంతం చారిత్రకంగా సర్దార్ పాపన్న గౌడ్ నాయకత్వంలో బహుజన రాజ్య స్థాపనకు పునాది అయిన ప్రాధాన్యతను సీఎం గుర్తుచేశారు.

శ్రీకాంతాచారి ఆశయ సాధన

తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అందించిన అండను ప్రధానిగా ప్రస్తావించిన సీఎం, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన హామీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చరిత్రను మరోసారి గుర్తుచేశారు. డిసెంబర్ 3న రాష్ట్ర ఉద్యమ శిఖరాగ్ర వీరుడు శ్రీకాంతాచారి చేసిన బలిదానాన్ని అభివర్ణిస్తూ, ఆయన ఆశయ సాధనలో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధమైందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాల ద్వారా మాత్రమే 1.04 లక్షల కోట్లు ఖర్చుచేసినట్లు సీఎం వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, నూతన రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పథకాలను సీఎం గుర్తుచేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే నిజమైన ప్రజాప్రభుత్వంగా తమ ప్రభుత్వం నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రాభాకర్, వీవీకే, అదలూరి లక్ష్మణ్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌లో రూ. 262.78 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన‌

హుస్నాబాద్‌లో ‘ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 262.78 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం (రూ. 44.12 కోట్లు) ప్రధానంగా నిలిచింది. తదుపరి, ప్రాంతీయ రవాణా, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించేందుకు రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి పునాది వేశారు. పట్టణ అభివృద్ధి భాగంగా హుస్నాబాద్ మునిసిపాలిటీలో రూ. 20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా, ప్రజలకు రవాణా సేవలను మరింత సులభతరం చేయడానికి రూ. 8.60 కోట్లతో కొత్త ఆర్టీఏ యూనిట్ కార్యాలయం నిర్మించనున్నారు.

రోడ్ల విస్తరణలో భాగంగా, ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులకు పునాది వేశారు. రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్, కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా నాలుగు లైన్ల రహదారి, అలాగే రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్, అక్కన్నపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు అమలు అయితే హుస్నాబాద్‌లో విద్య, రవాణా, పట్టణ అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku