
త్రివిధ దళాలకు దారి.. సైనిక్ స్కూల్స్
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. రక్షణ శాఖలో ఉన్నత కెరీర్‌ను ఆశించే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. త్రివిధ దళాలకు అవసరమైన నాయకత్వ లక్షణాలు కలిగిన క్యాడెట్‌లను చిన్నప్పటి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం 'ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (ఏఐఎస్ఎస్ఈఈ) 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి వివరాలను తెలుసుకొని, చివరి తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 30. ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ అక్టోబర్ 31. ఒకవేళ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి 2026లో ఉంటుంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు ముందు విడుదల చేస్తారు. ఫలితాలను పరీక్ష జరిగిన 4 నుండి 6 వారాల తర్వాత ప్రకటిస్తారు.
ఎవరు అర్హులంటే?
సైనిక్ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2026 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి/ఉత్తీర్ణులై ఉండాలి. బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి/ఉత్తీర్ణులై ఉండాలి. 9వ తరగతి ప్రవేశాలకు ప్రస్తుతం బాలురు మాత్రమే అర్హులు.
దరఖాస్తు విధానం
ఏఐఎస్ఎస్ఈఈ 2026 దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.nic.in/sainik-school-society/ని సందర్శించాలి. అక్కడ కింద కనిపించే "Registration for AISSEE-2026 Examination" లింక్‌పై క్లిక్ చేయండి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సిస్టమ్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ వివరాలతో లాగిన్ అయ్యి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపండి. వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, రిజర్వేషన్ కేటగిరీ, పరీక్షా కేంద్రాల ఎంపిక వంటి వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుమును (జనరల్, ఓబీసీ, డిఫెన్స్, ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే రూ.850, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.700) ఆన్‌లైన్‌లో చెల్లించి, ఒకసారి అన్ని వివరాలను సరిచూసుకుని ఫైనల్‌గా సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ప్రవేశ పరీక్ష వివరాలు
ఏఐఎస్ఎస్ఈఈ 2026 పరీక్ష ఆఫ్‌లైన్ (ఓఎంఆర్ షీట్ ఆధారిత) విధానంలో దేశవ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో జరుగుతుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 300 మార్కులకు 150 నిమిషాల పాటు జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. ఇలా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు. లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఇక తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష 400 మార్కులకు 180 నిమిషాల పాటు జరుగుతుంది. ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
క్వాలిఫైయింగ్ మార్కులు: మెరిట్ లిస్ట్ కోసం ఎంపిక కావాలంటే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మినహా ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 25 శాతం మార్కులు, మొత్తం మీద 40 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్.
ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఆ తర్వాత వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.nic.in/sainik-school-society/లో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.
సైనిక్ స్కూల్స్ గురించి..
సైనిక్ స్కూల్స్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు. వీటిని 1961వ సంవత్సరంలో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి వి.కె. కృష్ణ మీనన్ స్థాపించారు. సైనిక్ స్కూల్ సొసైటీ ఈ పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తుంది.
సైనిక్ స్కూల్స్ స్థాపించడానికి గల ప్రధాన లక్ష్యం జాతీయ రక్షణ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్‌ఏ), ఇతర శిక్షణా అకాడమీల్లో చేరేందుకు అవసరమైన అర్హతలను, నైపుణ్యాలను చిన్న వయస్సు నుంచే విద్యార్థులలో పెంపొందించడం, ఆర్థికంగా వెనుకబడిన, గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కూడా రక్షణ దళాలలో అధికారిగా చేరే అవకాశం కల్పించడం, విద్యార్థులలో శారీరక దృఢత్వం, మానసిక బలం, దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్ఫూర్తిని పెంపొందించే సైనిక శైలి శిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం.
ఎంత వరకు చదువుకోవచ్చు?
సైనిక్ స్కూల్స్‌లో విద్యార్థులు సాధారణంగా 6వ తరగతి లేదా 9వ తరగతిలో ప్రవేశం పొందుతారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులు 12వ తరగతి వరకు చదువుకోవచ్చు. సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థుల ప్రధాన లక్ష్యం నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరడం. 12వ తరగతి పూర్తయిన వెంటనే సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎన్‌డీఏ ప్రవేశ పరీక్ష రాసి, అందులో ఉత్తీర్ణులైతే, వారు ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో అధికారిగా శిక్షణ పొందేందుకు మూడు సంవత్సరాల అకాడమీ శిక్షణకు అర్హత సాధిస్తారు. సైనిక్ స్కూల్ విద్యార్థులు త్రివిధ దళాలలో చేరేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పాటు వారు సాధారణ పౌర వృత్తులలో లేదా ఇతర ఉన్నత విద్యా సంస్థలలో కూడా చేరవచ్చు. ఏది ఏమైనా సైనిక శిక్షణ నేపథ్యం ఉండటం వలన వారు ఏ రంగంలోనైనా క్రమశిక్షణతో రాణించగలుగుతారు.
ప్రస్తుతం భారతదేశంలో 33 ప్రభుత్వ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటి పరిపాలన రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానంలో 100కి పైగా నూతన సైనిక్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తోంది. ఏపీలో కోరుకొండ, కలికిరిలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతానికైతే రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ స్కూళ్లు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2, ఒక ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఉంది.
