Let's talk: editor@tmv.in
త్రివిధ దళాలకు ఒకే అధిపతి.. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ ఆమోదం

త్రివిధ దళాలకు ఒకే అధిపతి.. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ ఆమోదం

Shaik Mohammad Shaffee
13 నవంబర్, 2025

పాకిస్తాన్ సైనిక, న్యాయ వ్యవస్థల్లో పెను మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన వివాదాస్పద 27వ రాజ్యాంగ సవరణ బిల్లును నేషనల్ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు, సభలో గందరగోళం మధ్య కూడా పాలక సంకీర్ణ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించి ఈ బిల్లును ఆమోదింపజేసింది.

ఈ సవరణ బిల్లు దేశ రక్షణ, న్యాయ వ్యవస్థలలో కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. ఈ బిల్లు 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్' (సీడీఎఫ్) అనే కొత్త పదవిని సృష్టిస్తుంది. ప్రస్తుతం ఉన్న జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవి నవంబర్ 27, 2025న రద్దవుతుంది. ఆర్మీ చీఫ్‌గా ఉన్నవారే ఏకకాలంలో సీడీఎఫ్ పదవిని కూడా చేపడుతారు. ఆర్మీ చీఫ్ నకు (అంటే సీడీఎఫ్) త్రివిధ దళాలపై (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) పూర్తి వ్యవస్థాగత నియంత్రణ, అలాగే దేశ అణు కమాండ్‌పై అపరిమిత అధికారం లభిస్తుంది.

ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ వంటి ఐదు నక్షత్రాల హోదా పొందిన అధికారులు జీవితకాలం పాటు ఆ ర్యాంక్, ప్రత్యేక అధికారాలను అనుభవిస్తారు. అంతేకాక, వారికి రాజ్యాంగ రక్షణ కూడా లభిస్తుంది. ఇటీవలే ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ హోదాతో జీవితకాల రక్షణ పొందనున్నారు. అయూబ్ ఖాన్ తర్వాత ఈ హోదా పొందిన రెండో అధికారి ఈయనే.

న్యాయ వ్యవస్థ మార్పులు: రాజ్యాంగ సంబంధిత అంశాలను పరిశీలించడానికి ఒక ప్రత్యేక ఫెడరల్ రాజ్యాంగ కోర్టును ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత సుప్రీంకోర్టు అధికార పరిధి కేవలం సివిల్, క్రిమినల్ కేసులకు మాత్రమే పరిమితం అవుతుంది.

నేషనల్ అసెంబ్లీలో ఆమోదం

సెనేట్ (ఎగువ సభ) ఆమోదం పొందిన మరుసటి రోజు అంటే బుధవారం, నేషనల్ అసెంబ్లీ (దిగువ సభ)లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించిన ప్రకారం, బిల్లుకు 234 ఓట్లు అనుకూలంగా రాగా, కేవలం నాలుగు ఓట్లు మాత్రమే వ్యతిరేకంగా వచ్చాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్, పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వంటి కీలక నేతలు సభకు హాజరయ్యారు. న్యాయ శాఖ మంత్రి ఆజం నజీర్ తారర్ రాజ్యాంగ సంస్కరణ అనేది జాగ్రత్తగా ఆలోచించి చేసే 'పరిణామక్రమం' అని సమర్థించుకున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సభ్యులు బిల్లు కాపీలను చించి, ప్రధాని కుర్చీ వైపు విసిరివేశారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును బహిష్కరించి సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి.

ప్రతిపక్షాలు, విశ్లేషకులు ఈ సవరణ ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను బలహీనపరుస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పీటీఐ ఛైర్‌పర్సన్ గోహర్ అలీ ఖాన్, ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం 'మరో ఉన్నత వర్గాన్ని' సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదంతో 'ప్రజాస్వామ్యం కేవలం పేరుకే మిగిలిపోతుంది' అని ఆయన హెచ్చరించారు. ఈ సవరణ పాకిస్తాన్‌ను సైన్యం నేతృత్వంలోని రాజ్యాంగ నిరంకుశత్వం వైపు మరింతగా తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ బిల్లును అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం కోసం పంపారు. అతి త్వరలోనే ఆయన ఆమోదం లభించే అవకాశం ఉంది.

త్రివిధ దళాలకు ఒకే అధిపతి.. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ ఆమోదం - Tholi Paluku