
త్రిపుర విద్యార్థి హత్య భయంకరమైన ‘హేట్ క్రైమ్’: రాహుల్ గాంధీ
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన యువ విద్యార్థి అంజెల్ చక్మా హత్యను కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ఆయన భయంకరమైన విద్వేష నేరం (హారిఫిక్ హేట్ క్రైమ్)గా అభివర్ణించారు. దేశంలో విద్వేషాన్ని పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాధారణంగా మార్చుతోందని ఆయన ఆరోపించారు. పశ్చిమ త్రిపుర జిల్లా నందన్నగర్‌కు చెందిన 24 ఏళ్ల అంజెల్ చక్మా, డెహ్రాడూన్‌లో చదువుకుంటూ ఉండగా డిసెంబర్ 9న జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యను అతడు వ్యతిరేకించడంతో ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజెల్ చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మృతి చెందాడు.
ఈ ఘటనపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో స్పందించారు. అంజెల్ చక్మా, అతని సోదరుడు మైకేల్‌పై డెహ్రాడూన్‌లో జరిగిన దాడి ఒక భయంకరమైన హేట్ క్రైమ్ అని ఆయన ఆరోపించారు. ద్వేషం ఒక్కరోజులో పుట్టదని అన్నారు. సంవత్సరాలుగా , ముఖ్యంగా యువతలో విషపూరిత కంటెంట్, బాధ్యతారాహిత్యమైన కథనాల ద్వారా విద్వేషాన్ని నింపుతున్నారు. దీనిని అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం సాధారణంగా మారుస్తోందని ఆయన విమర్శించారు. భారతదేశం భయంతో కాదు, గౌరవం, ఐక్యతతో నిర్మితమైన దేశమని ఆయన స్పష్టం చేశారు. మనది ప్రేమ, వైవిధ్యాలతో నిండిన దేశం. సహచర భారతీయులపై దాడులు జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండే మృతసమాజంగా మనం మారకూడదు. మన దేశం ఏ దిశగా వెళ్తోందో ఆలోచించి, నిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు.
చక్మా కుటుంబంతో పాటు త్రిపుర, ఈశాన్య భారత ప్రజలతో నా ఆలోచనలు ఉన్నాయి. మిమ్మల్ని మా భారతీయ సోదర సోదరీమణులుగా పిలవడం మాకు గర్వకారణం అని ఆయన అన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ షా ఆదివారం స్పందిస్తూ, ఈ హత్యకు బాధ్యులైన అందరినీ అరెస్టు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంజెల్ చక్మాకు న్యాయం చేయాలంటూ, టిప్రా ఇండిజెనస్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఆదివారం అగర్తలలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉజ్జయంత ప్యాలెస్ నార్త్ గేట్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు కొనసాగింది.
అసలేం జరగిందంటే
డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి అంజెల్ చక్మా హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనను జాతి వివక్షతో కూడిన భయంకరమైన హేట్ క్రైమ్ గా పలు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఖండించాయి. డిసెంబర్ 9న, డెహ్రాడూన్‌లోని సెలాక్వీ ప్రాంతంలో ఒక మద్యం దుకాణం సమీపంలో ఫైనల్ ఇయర్ ఎంజీఏ విద్యార్థి అంజెల్ చక్మా (24) తన సోదరుడు మైకేల్ చక్మాతో కలిసి ఉన్న సమయంలో, మద్యం మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు వీరిపై చింకీ, చైనీస్ వంటి జాతి వివక్షతో కూడిన దూషణలు చేశారు.
మేం భారతీయులమే
ఈ వ్యాఖ్యలను అంజెల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. మేం భారతీయులమే అని వాదించాడు. దీంతో వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దుండగులు అంజెల్ మెడ, పొట్ట, తల భాగాల్లో కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజెల్‌ను ఆసుపత్రిలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చేర్చగా, అనేక రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 26న ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అంజెల్ మృతి చెందడంతో కేసులో హత్య సెక్షన్లు జోడించారు. అయితే ఈ కేసులోని ప్రధాన నిందితుడు నేపాల్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించగా, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహా పలువురు నేతలు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. త్రిపురలో విద్యార్థులు, పౌర సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈశాన్య భారత ప్రజలపై జరుగుతున్న వివక్షకు ముగింపు పలకాలని, అలాగే జాతీయ స్థాయి యాంటీ-రేసిజం (జాతి వివక్ష నిరోధక) చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, క్యాండిల్ లైట్ మార్చ్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఘటన మరోసారి ఈశాన్య భారతీయులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న జాతి వివక్షను వెలుగులోకి తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల బహుమతి
త్రిపురకు చెందిన యువ విద్యార్థి అంజెల్ చక్మా హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తున్నట్లు టిప్రా మోథా పార్టీ అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేవబర్మ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రధాన నిందితుడి అరెస్టుకు సహకరించే సమాచారం కోసం రూ.25 వేల బహుమతి ప్రకటించడంపై ప్రద్యోత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి హత్య చేసిన ప్రధాన నిందితుడి పట్టుకుంటే ఇంతేనా ఇచ్చేది? ఇది మా మీద జోక్ చేస్తున్నట్టే. అంజెల్ చక్మా హత్య చేసిన వ్యక్తిని పట్టించేందుకు సమాచారం ఇచ్చిన వారికి నేను రూ.10 లక్షలు ఇస్తాను. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండని ప్రద్యోత్ వీడియో సందేశంలో అన్నారు.
అలాగే టిప్రా మోథా పార్టీ ఆధ్వర్యంలోని త్రిపుర ట్రైబల్ ఏరియాస్ ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కూడా అంజెల్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆ పార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పూర్ణ చంద్ర జమాతియా ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ బుబాగ్రా (రాజు) ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేవబర్మ సిఫారసు మేరకు, అంజెల్ చక్మా అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ.3 లక్షల సహాయం మంజూరు చేశాం అని తెలిపారు.
