
త్రిపుర విద్యార్థి హత్యపై సుప్రీంకోర్టులో పిల్
డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి హత్య ఘటన నేపథ్యంలో, ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జరుగుతున్న జాతి విద్వేష దాడులను ప్రత్యేక నేరంగా గుర్తించడంలో భారత క్రిమినల్ చట్టాల్లో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలైంది. ఈ పిల్‌ను అడ్వకేట్ అనూప్ కుమార్ అవస్థి దాఖలు చేశారు. జాతి ఆధారిత ద్వేషంతో జరిగే హింసాత్మక దాడులను గుర్తించి, వాటిని ఎదుర్కొనేలా బాధ్యతాయుత మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
పిటిషన్ ప్రకారం, హత్యకు గురైన విద్యార్థిపై దాడి జరగడానికి ముందు అతడిని లక్ష్యంగా చేసుకుని జాతి పరమైన దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. అతడి జాతీయత, గుర్తింపుపై ప్రశ్నలు వేస్తూ, ఈశాన్య భారతీయులను విదేశీయులుగా చూసే సామాజిక ధోరణే ఈ దాడికి కారణమైందని పిటిషన్‌లో వాదించారు. ఈ విధమైన సామాజిక భావజాలం, ప్రజా సంభాషణల్లో నిర్లక్ష్యంగా పునరావృతమవుతూ, వ్యవస్థాగత నిర్లక్ష్యంతో కలిసినప్పుడు ప్రాణాంతకంగా మారుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అంశంపై స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేకపోవడం వల్ల, జాతి ప్రేరిత హింసను ప్రత్యేక రాజ్యాంగ విరుద్ధ నేరంగా గుర్తించేందుకు సుప్రీంకోర్టు జోక్యం అవసరమని పిటిషన్ స్పష్టం చేసింది. ఇది ప్రతి పౌరుడి గౌరవం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు అవసరమని పేర్కొంది. అదేవిధంగా 2017లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ప్రస్తుత శిక్షా చట్టాలు సరిపోవని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో అంగీకరించిన విషయాన్ని పిటిషన్ గుర్తు చేసింది. అయినప్పటికీ జాతి వివక్షను ప్రత్యేక నేరంగా గుర్తించేలా ఎలాంటి చట్ట సవరణలు చేయలేదని ఆరోపించింది.
ఒకవైపు సమస్య ఉందని కేంద్రం అంగీకరించింది. మరోవైపు, విద్వేష నేరాలను ఎదుర్కొనే ప్రత్యేక చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఇది పరిపాలనా ఆలస్యం కాదు, చర్యల లోపం. అందుకే న్యాయస్థాన జోక్యం అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇంకొక ముఖ్య అంశంగా, ఈశాన్య భారతీయులను ఉద్దేశించి చైనీస్, చింకీ వంటి జాతి దూషణలను సాధారణ మాటలుగా పరిగణించడం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని పిటిషన్ పేర్కొంది. ఈ విధమైన దూషణలను జాతి ద్వేషానికి ఆధారాలుగా పరిగణించకపోవడం వల్ల, కఠిన శిక్షా నిబంధనలు అర్థ హీనంగా మారుతున్నాయని తెలిపింది.
ఈ ఘటనలో మృతుడైన విద్యార్థిని అంజెల్ చక్మాగా గుర్తించారు. డిసెంబర్ 9న డెహ్రాడూన్‌లో అతడిపై కత్తులు, పదునైన ఆయుధాలతో దుండగులు దాడి చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి సోదరుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా, వారిని జువైనైల్ హోంకు తరలించారు. ఆరో నిందితుడిని నేపాల్ పౌరుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
