
త్రిపురలో రూ.45 కోట్ల యాబా మాత్రల స్వాధీనం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర బలగాలు కఠిన చర్యలు కొనసాగిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా అస్సాం రైఫిల్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో సుమారు రూ.45 కోట్ల విలువైన యాబా మాత్రల(టాబ్లెట్ల)ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, జనరల్ ఏ. ముంగియాకమి ప్రాంతంలో నిర్వహించిన సంయుక్త దాడిలో అస్సాం రైఫిల్స్, డీఆర్‌ఐ అధికారులు కలిసి ఏఎస్-01టీ-సీ7674 నంబర్ గల టాటా ట్రక్‌ను తనిఖీ చేసి దాదాపు 4,50,000 యాబా మాత్రలను పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం డీఆర్‌ఐకి అప్పగించారు.
ఖోవాయ్ జిల్లాలోనూ పట్టివేత
ఇదివరకు ఖోవాయ్ జిల్లాలో మాదకద్రవ్య రవాణా జరుగుతోందన్న సమాచారంతో నిర్వహించిన మరో ఆపరేషన్‌లో, అస్సాం రాష్ట్రంలోని కరీంఘంజ్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. జనవరి 24న అర్ధరాత్రి ఎన్ హచ్-8 మార్గంలో 1,60,000 యాబా మాత్రలను (రూ.16 కోట్ల విలువ) తరలిస్తుండగా అతడిని పట్టుకున్నారు. మాదకద్రవ్యాలు తరలించిన టాటా ట్రక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అస్సాం రైఫిల్స్ ప్రాంతంలో మాదకద్రవ్య ముఠాలను అణిచివేయడంలో ముందుండి చర్యలు చేపడుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ముందు వీటిని స్వాధీనం చేసుకోవడం కీలకమైందని అధికారులు తెలిపారు.
మిజోరంలో మరో ఆపరేషన్
అదే సమయంలో మిజోరం రాష్ట్రంలోని చంపాయ్ జిల్లాలో న్గూర్ సమీపంలో నిర్వహించిన మరో ఆపరేషన్‌లో 2.2 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.6.6 కోట్లు ఉంటుందని అంచనా. కెన్బో బైక్‌పై తరలిస్తున్న లాల్‌హ్మంగైహ్జువాలా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు చంపాయ్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ శాఖకు అప్పగించారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యాబా మాత్రలు మెథాంఫెటమైన్ ఆధారిత మాదకద్రవ్యాలు. వీటి అక్రమ రవాణా ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్నట్టు వివరించారు.
