
తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా 2 అవినీతి కేసులో శనివారం ఒక ప్రత్యేక కోర్టు చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
రావల్పిండిలోని అడియాలా జైలులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారూఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. వీరిద్దరికీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. శిక్షతో పాటు ఇద్దరికీ చెరో 16.4 మిలియన్ పాకిస్థానీ రూపాయల జరిమానా విధించారు.
కేసు నేపథ్యం
2021లో సౌదీ ప్రభుత్వం నుండి అందిన ఖరీదైన వాచీలు, వజ్రాలు, బంగారు ఆభరణాలను తోషాఖానా (ప్రభుత్వ ఖజానా)లో జమ చేయకుండా, తక్కువ ధరకు విలువకట్టించి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ ఖాన్ వయస్సు (73 ఏళ్లు), బుష్రా బీబీ మహిళ అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని, చట్టప్రకారం కొంత కనికరం చూపిస్తూ ఈ శిక్షను ఖరారు చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
(తోషాఖానా అంటే ఏమిటి?)
ఈ కేసు 2021లో సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి అందిన ఖరీదైన కానుకలకు సంబంధించినది.
ఆరోపణ:
మాజీ ప్రధాని దంపతులు తమకు అందిన విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఖరీదైన గడియారాలను ప్రభుత్వ ఖజానా అయిన 'తోషాఖానా'లో జమ చేయలేదు. ఈ వస్తువుల అసలు విలువ సుమారు 70 మిలియన్ల (7 కోట్లు) రూపాయలు కాగా, వాటి విలువను కేవలం 5.8 మిలియన్లుగా (58 లక్షలు) తక్కువ చేసి చూపించి, అతి తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకున్నారని ప్రాసిక్యూషన్ నిరూపించింది. విదేశీ ప్రముఖుల నుండి అందే కానుకలను నిబంధనల ప్రకారం తోషాఖానాలో జమ చేయాలి. అవసరమైతే నిర్ణీత రుసుము చెల్లించి వాటిని కొనుగోలు చేయవచ్చు, కానీ ఇక్కడ విలువను తక్కువ చేసి చూపి మోసం చేశారని ప్రభుత్వం వాదించింది.
న్యాయ విచారణ, ఇమ్రాన్ ఖాన్ వాదన
ఈ కేసు విచారణలో మొత్తం 21 మంది సాక్షులను కోర్టు విచారించింది. తీర్పు సమయంలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ ఇద్దరూ కోర్టులో ఉన్నారు. తనపై మోపబడిన ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని, తనను అణచివేయడానికి అల్లిన కట్టుకథలని ఆయన వాదించారు. గతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో వీరిద్దరికీ ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, విచారణ కొనసాగి ఇప్పుడు శిక్ష ఖరారైంది.
జైలు పరిస్థితులపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుండి అదియాలా జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి జైలులో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
ఈ విషయం పై ఐక్యరాజ్యసమితి స్పందిస్తూ ,ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత ఖైదులో ఉంచడం అమానవీయమని ఐరాస ప్రతినిధి ఆలిస్ జిల్ ఎడ్వ ర్డ్స్ విమర్శించారు. ఆయనకు బయటి వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, కనీసం తోటి ఖైదీలతో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని నివేదికలు చెబుతున్నాయి.
నిషేధం:
గత నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. చివరిసారిగా డిసెంబర్ 2న ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ఆయనను కలిశారు.
తదుపరి చర్యల్లో భాగంగా ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వారు అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో కూడా దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నారు.
