
తోపుదుర్తి, పరిటాల వార్ ఎందుకు ?
జగనన్న కాలనీల నిర్మాణం విషయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరిటాల సునీతతో పాటు ఏపీ ఎమ్మెల్యేలపైన తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. పరిటాల సునీతతో పాటు ఏపీ ఎమ్మెల్యేలపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలకు కారణమేంటన్న చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలందరినీ ఎందుకు టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పేదవారికి ఇళ్ల నిర్మించి ఇవ్వాలనే ఆలోచనతో జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణ కాంట్రాక్టును తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాక్రీట్ సంస్థ పనులు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాక్రీట్ సంస్థ పనులు కొనసాగించడానికి అడ్డంకి ఏర్పడింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇళ్ల నిర్మాణం అడ్డుకున్నారన్నది తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణ. ఇటీవల ప్రెస్ మీట్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
అంతటితో ఆగకుండా పరిటాల సునీతతో పాటు ఏపీలోని ఎమ్మెల్యేలు జగనన్న కాలనీలను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. ఒక్కో లబ్ధిదారుడితో రూ. 10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. ఏపీలో ఏ నియోజకవర్గంలో అయితే జగనన్న కాలనీలు ఉన్నాయో, ఆ నియోజకవర్గంలో వసూళ్ల పర్వం కొనసాగుతోందన్నది ప్రకాశ్ రెడ్డి ఆరోపణ. ఇది తప్పని నిరూపించుకోవాలంటూ చంద్రబాబు,లోకేష్ కు సవాల్ విసిరారు.
విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో ఇళ్ల నిర్మాణం ఆపారన్నది ప్రకాశ్ రెడ్డి చెబుతున్న మాట. పనులు చేయడానికి ప్రకాశ్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ సిద్ధంగా ఉంది. కానీ అడ్డుకుంటున్నారన్నది ప్రకాశ్ రెడ్డి ఆరోపణ. రాక్రీట్ సంస్థకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపారని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో నిర్మాణం ఆపిన వారు ఇప్పటి వరకు కోర్టుకు నివేదిక ఇవ్వకుండా, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రత్యర్థి కాబట్టి పరిటాల సునీత రాక్రీట్ సంస్థను పనులు చేయకుండా ఆపి ఉండవచ్చు. కానీ పేదలు మాత్రం నష్టపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణ నిజమైతే ప్రభుత్వానికి చెడ్డపేరే. అది ఆరోపణ అయితే పర్వాలేదు. కానీ నిజం అయితే కష్టం. రాజకీయాలు పక్కన పెట్టి పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి. లబ్ధిదారులకు న్యాయం చేయాలి. అది ప్రభుత్వానికి కూడా మంచిని చేకూరుస్తుంది.
