
తొలి సీజన్‌తోనే సంచలనం: ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు ఇండియా స్పోర్ట్స్ అవార్డు
ప్రపంచంలోనే తొలి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్ అయిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘ఎమర్జింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకుంది. ఎఫ్‌ఐసీసీఐ ఫెడరేషన్ హౌస్‌లో జరిగిన ఎఫ్‌ఐసీసీఐ టర్ఫ్ 2025, 15వ గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో రూపొందిన ఏపీఎల్, తొలి సీజన్‌తోనే సంచలనం సృష్టించింది. అక్టోబర్ రెండు నుంచి 12 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌తోపాటు అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లు (పురుషులు-మహిళలు) రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పాల్గొన్నారు.
ఫ్రాంచైజీ ఆధారిత నమూనా, లింగ సమానత్వం కలిగిన జట్ల నిర్మాణం, ప్రసారాలకు అనువైన ఫార్మాట్‌తో ఏపీఎల్, ఆర్చరీని మెయిన్‌స్ట్రీమ్ ప్రేక్షకులకు ఆకర్షణీయంగా మార్చిన వినూత్న ప్రయత్నంగా గుర్తింపు పొందింది.
ఏపీఎల్ డైరెక్టర్ అనిల్ కామినేని మాట్లాడుతూ, ‘మా ఆటగాళ్లకు ప్రపంచస్థాయి వేదిక ఏర్పాటు చేయడం, భారత్ ఒలింపిక్ ఆశయాలను వేగవంతం చేయడమే ఏపీఎల్ లక్ష్యం. ఈ అవార్డు మాకు మాత్రమే కాదు, మొదటి రోజు నుంచి నమ్మిన ఆటగాళ్లకు, భాగస్వాములకు, అభిమానులకు అంకితం. వారి నమ్మకమే తొలి సీజన్‌ను ఇంతటి విజయవంతం చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.
తొలి సీజన్‌కు ప్రేక్షకులు, మీడియా నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆకర్షణీయ ఫ్రాంచైజీలు, ఉత్సాహకరమైన పోటీ ఫార్మాట్, ఒలింపిక్ క్రీడలపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ఇవన్నీ ఏపీఎల్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడంతో, ముఖ్యంగా యువతలో ఆర్చరీకి కొత్త ఉత్సాహం నింపారు. ఆయన ఉనికి లీగ్‌కు అపారమైన ప్రచారం తెచ్చిపెట్టింది.
వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖల నుంచి బలమైన మద్దతు లభించడం, భారత్ ప్రపంచ ఆర్చరీ వేదికపై ఎంతో ఎత్తుకు ఎదిగిందనడానికి నిదర్శనం.
తొలి సీజన్‌తోనే పరిశ్రమలో గుర్తింపు, ప్రేక్షకుల మద్దతు సాధించిన ఏపీఎల్, భారత ఆర్చరీ భవిష్యత్తును పోటీ, వాణిజ్య, సాంస్కృతిక దృక్కోణాల్లోనూ మార్చివేసే స్థాయికి చేరుకుంది.
