
తొలి మొబైల్ యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్’ రేంజర్ విడుదల
సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాల స్మగ్లింగ్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ బుధవారం దేశంలోనే తొలి పూర్తి మొబైల్ యాంటీ-డ్రోన్ గస్తీ వాహనమైన ‘ఇంద్రజాల్ రేంజర్’ను ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ శత్రు డ్రోన్లను గుర్తించడం, ట్రాక్ చేయడం, కూల్చివేసే సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. కదులుతూనే శత్రువులపై దాడి చేయడం దీని ప్రత్యేకత.
“భారత్ కొత్త రకం శత్రువును ఎదుర్కొంటోంది. ఆ శత్రువు గాలిలో ఎగురుతాడు. ఇకపై స్మగ్లర్లు కాలినడకన కాకుండా, నిమిషాల్లో గాలిలోనే సరిహద్దు దాటేస్తున్నారు. ఈ కొత్త యుద్ధభూమికి ఇంద్రజాల్ రేంజర్ భారత్ సమాధానమని’ ఇంద్రజాల్ వ్యవస్థాపకుడు, సీఈవో కిరణ్ రాజు అన్నారు. ఆల్ టెర్రైన్ 4×4 ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ వాహనం ఇంద్రజాల్ అభివృద్ధి చేసిన స్కైఓఎస్ స్వయం ప్రతిపత్తి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 10 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లను గుర్తించగలదు. 4 కిలోమీటర్ల లోపు ఆపేయగలదు లేదా దాన్ని కూల్చి వేస్తుంది. ఏఐ ఆధారిత ట్రాకింగ్, సైబర్ టేకోవర్, సాఫ్ట్-కిల్ పద్ధతులు, ఇంటర్‌సెప్టర్ డ్రోన్ల వంటి బహుళ కౌంటర్-యూఏఎస్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. సరిహద్దు రోడ్లు, కాలువలు, వ్యవసాయ ప్రాంతాలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, జనసాంద్రత గల పట్టణ ప్రాంతాల్లో కదిలేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాహనం రియల్ టైమ్ నిఘా, స్వయంచాలకంగా ముప్పును అంచనా వేస్తోంది. తక్షణమే శత్రు డ్రోన్లను అడ్డుకుని కూల్చివేస్తుంది. లేకుంటే వాటిని జామ్ చేస్తుంది. సరిహద్దు భద్రతా దళాలు, పోలీసు యూనిట్ల కోసం రూపొందించిన ఇంద్రజాల్ రేంజర్ డ్రోన్లు ప్రధాన స్మగ్లింగ్ సాధనంగా మారిన ఈ కొత్త భద్రతా సవాళ్లకు వేగవంతమైన, స్వయంప్రతిపత్తి, నిర్ణయాత్మక ప్రతిస్పందనను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ వాహనం ఇప్పటికే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ వాహనం తయారీకి ప్రేరణ
రెండు ఘటనలు ఐఎస్ఐ మద్దతుతో ఆయుధాల స్మగ్లింగ్
• ఇటీవల పంజాబ్-జమ్మూ సరిహద్దుల్లో జరిగిన ఘటనలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు భారత భూభాగంలోకి చేరాయి.
• 255 పాకిస్తాన్ డ్రోన్లు కూల్చివేత
• ఈ ఏడాది ఇప్పటివరకు బీఎస్ఎఫ్ సిబ్బంది 255 పాక్ డ్రోన్లను కూల్చివేసింది.
రూ.10 వేల కోట్ల డ్రగ్ స్మగ్లింగ్ వ్యవస్థలో కూడా డ్రోన్లే ప్రధాన రవాణా మార్గంగా నిందితులు వాడుకుంటున్నారు.
