Let's talk: editor@tmv.in
తొలి మానవరహిత గగన్‌యాన్ మిషన్‌కు సిద్ధం

తొలి మానవరహిత గగన్‌యాన్ మిషన్‌కు సిద్ధం

Pinjari Chand
1 ఫిబ్రవరి, 2026

భారతదేశ తొలి మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమమైన గగన్‌యాన్ మిషన్ కోసం తొలి మానవరహిత (అన్‌క్రూడ్) మిషన్ దిశగా ఇస్రో వేగంగా పనిచేస్తోందని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. గగన్‌యాన్ మిషన్‌ను 2027లో చేపట్టాలని ప్రణాళిక రూపొందించామని ఆయన వెల్లడించారు. గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా 2027కు ముందుగా మూడు మానవరహిత ప్రయోగాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలో తొలి మిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ మిషన్ ద్వారా మూడు రోజుల పాటు ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, సురక్షితంగా భూమికి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. గగన్‌యాన్ మిషన్ విజయానికి అనేక కీలక పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వ్యోమగాముల భద్రత అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, ప్రతి వ్యవస్థను నూరు శాతం ఖచ్చితత్వంతో పరీక్షించి అర్హత నిర్ధారించాల్సి ఉందని అన్నారు. రాకెట్ వ్యవస్థలో ఎలాంటి లోపానికి ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గగన్‌యాన్ విజయం మా లక్ష్యం. అందుకోసం పరిపూర్ణంగా పని చేస్తున్నామని నారాయణన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, జనవరి 12న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిన విషయంపై స్పందించిన ఆయన, ఆ మిషన్‌కు సంబంధించి అన్ని అంశాలను శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. లోపాలపై విశ్లేషణ పూర్తయిన అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని అన్నారు.

గగన్‌యాన్ తో అంతరిక్ష శక్తిగా భారత్ కొత్త అధ్యాయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ దేశాన్ని అంతరిక్ష రంగంలో మరోమెట్టు పైకి తీసుకెళ్లనుంది. ఈ మిషన్ ద్వారా మనుషులను అంతరిక్షానికి పంపగల సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలవనుంది. ప్రస్తుతం ఈ సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే ఉండగా, గగన్‌యాన్ విజయవంతమైతే భారత్ నాలుగో దేశంగా అవతరిస్తుంది. గగన్‌యాన్ మిషన్ ద్వారా భారత్‌లో అత్యాధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కానుంది. మానవుల జీవనానికి అవసరమైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, హ్యూమన్ రేటెడ్ రాకెట్లు, రీఎంట్రీ హీట్ షీల్డ్ టెక్నాలజీ, అత్యవసర ఎస్కేప్ సిస్టమ్స్ వంటి కీలక సాంకేతికతలు స్వదేశీగా రూపుదిద్దుకోనున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతరిక్ష స్థావరాలు, మానవ చంద్ర మిషన్లకు పునాది వేయనున్నాయి.

ఈ మిషన్ దేశీయ పరిశ్రమలకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గగన్‌యాన్ ప్రాజెక్టులో 500కుపైగా భారతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లకు విస్తృత అవకాశాలు లభించడంతో పాటు, స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందనుంది. అంతేకాకుండా గగన్‌యాన్ యువతకు గొప్ప ప్రేరణగా నిలవనుంది. సైన్స్, టెక్నాలజీ, ఏరోస్పేస్, రోబోటిక్స్ వంటి రంగాలపై ఆసక్తి పెరిగి, భవిష్యత్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తయారవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది దేశంలోని నైపుణ్యాభివృద్ధికీ దోహదపడనుంది.

జాతీయ భద్రతా పరంగా కూడా గగన్‌యాన్ కీలకంగా మారనుంది. స్వదేశీ సాంకేతికతలపై ఆధారపడడం వల్ల విదేశీ సహకారంపై ఆధారత తగ్గి, అంతరిక్షంలో భారత్ వ్యూహాత్మకంగా మరింత బలంగా నిలవనుంది. శాటిలైట్ నిఘా, రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. ఆర్థికంగా చూస్తే,గగన్‌యాన్ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపనుంది. భవిష్యత్తులో కమర్షియల్ స్పేస్ ఫ్లైట్స్, అంతరిక్ష పర్యాటకం వంటి అవకాశాలకు మార్గం సుగమం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లలో భారత్ కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉంది. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో జరిగే పరిశోధనలు వైద్య రంగానికి కూడా ఉపయోగపడనున్నాయి. కొత్త ఔషధాలు, మెడికల్ టెక్నాలజీల అభివృద్ధికి గగన్‌యాన్ మిషన్ దోహదపడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, గగన్‌యాన్ మిషన్ శాస్త్రీయ పురోగతి, పరిశ్రమల అభివృద్ధి, జాతీయ భద్రత, యువత ప్రేరణ, అంతర్జాతీయ ప్రతిష్ఠగా భారత్‌కు ఒక మైలురాయిగా నిలవనుంది.