
తొలిరోజే అసెంబ్లీ ఉద్రిక్తం .. కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే ప్రాంగణం దద్దరిల్లింది. ఒకవైపు సభలో బీజేపీ సభ్యుల ఆందోళన.. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చివరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.
అంతకుముందు గన్‌పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్ నేతలు నల్లచొక్కాలతో నిరసన చేపట్టారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్లచొక్కాలతో అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
వ్యాన్‌లో హరీశ్‌రావు తరలింపు
పోలీసుల తీరును నిరసిస్తూ హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలు తమ టీషర్టులు విప్పేశారు. అనంతరం పోలీసులు వారిని వ్యాన్‌లో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలకు స్వల్ప గాయాలయ్యాయని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 30 నుంచి 40 నిమిషాలపాటు అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.
‘నల్లటి టీషర్టు ధరించడం ఏ చట్టం ప్రకారం నేరం? రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు నల్లటి టీషర్టు వేసుకుని వస్తే తప్పులేదు.. మేం అసెంబ్లీకి వస్తే నేరమా?’ అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
‘వెయ్యి రోజులైనా హామీలు నెరవేరలేదు’
కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి.. వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి హామీల అమలుపై ప్రశ్నించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్.. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు?
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు జుట్టు పట్టుకున్నారని, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించినదిగా పేర్కొంటూ పార్టీ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా?’ అని ప్రశ్నించింది.
సభలోనూ బీజేపీ ఆందోళన
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విజ్ఞప్తి చేసినా బీజేపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పినా ఆందోళన కొనసాగడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పలువురు కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనిపై పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు. మధుసూదన్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. అలాగే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మధుసూదన్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కూడా ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సంఘీభావం ప్రకటించారు.
సెప్టెంబర్ 1తో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల తొలిరోజు నల్లచొక్కాలతో నిరసన చేపట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.
సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో ఈ సెంట్రల్ హాల్‌కు నామకరణం చేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
