
తొలిదశ పంచాయతీ పోరులో బీఆర్‌ఎస్ విజయం: కేటీఆర్
తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన సంకేతాలను పంపాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ ఎన్ని దౌర్జన్యాలు చేసినా, హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ వేదిక ద్వారా తెలిపిన వివరాల ప్రకారం..ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనలు నిర్వహించినప్పటికీ, పోటీ చేసిన చోట కాంగ్రెస్ ఐదు దశాబ్దాల మార్క్ అయిన 50 శాతంకు దగ్గరగా కూడా రాని పరిస్థితి, గరిష్టంగా 44 శాతం సీట్లు మాత్రమే దక్కించుకోవడం ప్రస్తుతం ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు స్పష్టమైన నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెల్లో రెండు సంవత్సరాల పాలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని, ఈ ఫలితాలు దానికి ప్రతిబింబమని ఆయన అన్నారు.
ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పెన్షన్ పెంపులో చేపట్టిన మార్పులు, మహాలక్ష్మి పథకంపై వచ్చిన విమర్శలు, తులం బంగారం వాగ్దానంపై ప్రజల్లో నెలకొన్న నిరాశ ఇవన్నీ కాంగ్రెస్ పట్ల నమ్మకం దెబ్బతిన్న కారణాలుగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు కూడా ప్రభావం చూపాయని. యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పంట బోనస్‌పై స్పష్టత లేకపోవడం, పండించిన ధాన్యం అమ్ముకోలేక పడిన కష్టాలు అన్నీ కలిపి రైతు వర్గాన్ని అసంతృప్తికి గురి చేశాయని ఆయన తెలిపారు.
పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పడకేసిన పాలన, గాడితప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టంచేస్తున్నాయని ,గ్రామాల్లో మౌలిక వసతులు కుంగిపోవడం ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేసాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 10–20 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం కూడా గ్రామీణ వర్గం తీరు ఏ దిశలో ఉన్నదో స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
తొలిదశ పంచాయతీ ఫలితాలు తెలంగాణలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని చూపించాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం లేకపోవడం మరోసారి బయటపడిందని వారు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన సర్పంచ్ స్థానాలు సుమారు 1000 పైగా గా ఉన్నాయి.
