
తొర్రూర్ మున్సిపాలిటీని నందనవనంగా తీర్చిదిద్దుతా: మంత్రి పొంగులేటి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణాల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, నాగరాజు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మిత్రపక్షం సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను దత్తత తీసుకున్న తొర్రూర్ మున్సిపాలిటీని నందనవనంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అదనంగా రూ.10 కోట్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
తొర్రూర్ మున్సిపాలిటీలో గతంలో బీఆర్ఎస్‌కు చెందిన బినామీ కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆరోపించిన మంత్రి, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడమో లేదా పనులు పూర్తి చేయించడమో తానే బాధ్యతగా తీసుకుంటానన్నారు.
మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయించే చర్యలు తీసుకుంటామని, ఎల్లమ్మ గుడి నిర్మాణాన్ని తన సొంత నిధులతో చేపడతానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల్లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించామని ఆయన అన్నారు.
ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు. తొర్రూర్, వర్ధన్నపేట పట్టణాల అభివృద్ధి బాధ్యత తమదైతే, కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
