Let's talk: editor@tmv.in
తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో ఎర్రబెల్లి కంటతడి.. రాజకీయాల్లో ఉండాలా, వద్దా?

తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో ఎర్రబెల్లి కంటతడి.. రాజకీయాల్లో ఉండాలా, వద్దా?

Gaddamidi Naveen
18 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల వేళ తొర్రూరులో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల సాయంతో కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అపహాస్యం చేశారని ఆరోపించారు. తొర్రూర్‌ మున్సిపాలిటీని కోల్పోవడంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టుకున్నారు.

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసి నర్సింహులుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాన్ని ఎప్పుడూ చూడలేదు. మెజారిటీ లేకపోయినా కౌన్సిలర్లను బెదిరించి, దాడులు చేసి మున్సిపాలిటీని లాక్కున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు రెండూ లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌కే ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే అధికారులు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.

తొర్రూర్‌లో మొత్తం 16 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7 గెలుచుకోగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యల ఎక్స్‌అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌ సంఖ్య 9కి పెరిగింది. రెండు పార్టీల బలాలు సమానం కావడంతో అధికారులు లాటరీ ద్వారా ఛైర్మన్‌ను నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కడియం కావ్య ఎక్స్‌అఫీషియో ఓటు చెల్లదంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులతో ఆందోళనకు దిగిన దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు.

తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో ఎర్రబెల్లి కంటతడి.. రాజకీయాల్లో ఉండాలా, వద్దా? - Tholi Paluku