Let's talk: editor@tmv.in
తొమ్మిది మందిని బ‌లి తీసుకున్న తుఫాన్‌!

తొమ్మిది మందిని బ‌లి తీసుకున్న తుఫాన్‌!

Venkatesh Balusula
30 సెప్టెంబర్, 2025

వియ‌త్నాం దేశంలో బువాలోయ్ తుఫాన్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా తీవ్ర న‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. భారీ వర్షాలు, వ‌ర‌ద‌లు, బలమైన గాలులు బీభ‌త్సాన్ని సృష్టించాయి. మధ్య వియత్నామ్‌లో రోడ్లు మునిగాయి. ఇండ్ల‌ పైకప్పులు ఎగిరిపోయాయి. వేర్వేరు చోట్ల‌ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. చేప‌ల వేట‌కు వెళ్లిన 17 మంది మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు. స‌హాయ‌క బృందాలు వీరి కోసం గాలిస్తున్నాయి.

3.47 ల‌క్షల ఇండ్ల‌కు విద్యుత్ అంత‌రాయం

తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. పాఠశాలలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. తాత్కాలిక వంతెన‌లు పూర్తిగా కొట్టుకుపోయాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. పలు రాష్ట్రాల్లో భ‌యంక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నగరాల్లో వరదల ప్ర‌భావానికి వాహనాలు కొట్టుకుపోయాయి. గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల కోసం గాలిస్తున్నారు. త‌క్ష‌ణ‌మే అధికారులు చేప‌ల వేట‌కు వెళ్లే బోట్ల‌ను నిలిపివేశారు. స్థానికంగా సుమారు గంట‌కు 70 కిలో మీట‌ర్ల వేగంతో గాలుల వీస్తున్నాయి. నాలుగు కోస్టల్ విమానాశ్ర‌యాల‌ను మూసివేశారు. వియ‌త్నాంలో అత్యంత అంద‌మైన రాష్ట్రంగా పేరొందిన నిన్ బిన్ రాష్ట్రంలో ఆరుగురు మ‌ర‌ణించ‌డం విషాదాన్ని నింపింది. థాన్ హోవాలో స్థానిక అధికారి న్గుయెన్ న్గాక్ హంగ్ చనిపోయారు. తుఫాన్ గురించి ముంద‌స్తు చ‌ర్య‌ల‌పై స‌మావేశం నిర్వ‌హించి ఇంటికి తిరిగి వెళ్తుండగా చెట్టు విరిగిపడి మరణించారు. హ్యూ నగరంలో వరదల్లో ఓ వ్య‌క్తి కొట్టుకుపోయాడు. డానాంగ్‌లో మరొకరు చనిపోయారు. క్వాంగ్ ట్రిలో బలమైన గాలుల ప్ర‌భావంతో చేప‌ల బోట్లు స‌ముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది బోటుతో స‌హా సముద్రంలోకి వెళ్లారు. వీరిలో నలుగురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. తుఫాన్ ప్ర‌భావంతో 3,47,000 ఇండ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు ప్ర‌భుత్వ మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఈ తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం ముందే మధ్య, ఉత్తర ప్రావిన్సుల నుంచి వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలించింది. ఇది ఉత్తర కోస్టల్ ప్రావిన్స్ హా టిన్‌లో అర్ధరాత్రి తీరాన్ని తాకింది. 133 కిలోమీటర్ల వేగం గాలులు వీచాయి. భారీ వర్షాలు కురిశాయి. బువాలోయ్ ప్ర‌భావంతో ఇప్ప‌టికే ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం నుంచి 20కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వంద‌లాది చెట్లు విరిగిపోయాయి. పలు న‌గ‌రాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. 23,000 కుటుంబాల‌ను 1,400 శిబిరాల‌కు తరలించారు. ఆసియాలో గ‌త‌ వారం రోజుల్లో ఇదే పెద్ద తుఫాన్‌గా తెలుస్తోంది. రగాసా తుఫాన్ ఈ ఏడాది అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన తుఫాన్‌గా అధికారులు పేర్కొంటున్నారు. ర‌గాసా ప్ర‌భావంతో ఉత్తర ఫిలిప్పీన్స్ తైవాన్‌లో 28 మంది మృతి చెందారు.

బువాలోయ్ తుఫాన్ వియ‌త్నాంను భారీ దెబ్బ కొట్టింది. ప్ర‌భుత్వం తీసుకున్న ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు భారీ ప్రాణ న‌ష్టాల‌ను త‌ప్పించాయ‌ని చెప్పొచ్చు. కానీ ప‌లు చోట్ల ప్ర‌జ‌లు గ‌ల్లంత‌వ‌డం ఆందోళ‌న‌కరంగా మారింది. భారీ ఎత్తున ఆస్తి న‌ష్టం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లు ప‌రిశీలిస్తే ప్ర‌భుత్వం తుఫాన్ తీవ్ర‌త‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్ర‌భుత్వం ముందు చాలా స‌వాళ్లున్నాయి. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతోపాటు, న‌ష్ట ప‌రిహారాల‌పై దృష్టి సారించాలి. విద్యుత్ స‌ర‌ఫ‌రా, దెబ్బ తిన్న రోడ్ల‌ను పున‌రుద్ధ‌రించాలి. తీవ్రంగా న‌ష్ట‌పోయిన మ‌త్స్య కార్మికుల‌ను ఆదుకోవాలి. వాతావరణ మార్పుల‌ను ముంద‌స్తుగా గుర్తించే సాంకేతిక‌త‌ను మ‌రింత‌ అభివృద్ధి చేసుకోవాలి. ప్ర‌జ‌ల‌కు ముందస్తు హెచ్చరికలు, మౌలిక సదుపాయాల‌ను మ‌రింత‌ బలోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది.

తొమ్మిది మందిని బ‌లి తీసుకున్న తుఫాన్‌! - Tholi Paluku