
తైవాన్‌తో సంబంధాల పునరుద్ధరణ దిశగా చైనా!
సుదీర్ఘకాలంగా ఉద్రిక్తంగా కొనసాగుతున్న చైనా-తైవాన్ సంబంధాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. తైవాన్‌తో తెగదెంపులు చేసుకున్న కొన్ని కీలక సంబంధాలను పునరుద్ధరించాలని చైనా నిర్ణయించింది. ప్రధానంగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పెంచడంతో పాటు, నిలిపివేసిన తైవాన్ సముద్ర ఉత్పత్తుల దిగుమతులను మళ్లీ ప్రారంభించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ 'కుమింగ్టాంగ్' అధినేత్రి పర్యటన ముగిసిన తరుణంలో బీజింగ్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
శాశ్వత చర్చల దిశగా అడుగులు
చైనా కమ్యూనిస్ట్ పార్టీ పరిధిలోని 'తైవాన్ వర్క్ ఆఫీస్' ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కమ్యూనిస్ట్ పార్టీకి, తైవాన్‌కు చెందిన కుమింగ్టాంగ్ పార్టీకి మధ్య దీర్ఘకాలిక సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. గత శుక్రవారం కుమింగ్టాంగ్ అధ్యక్షురాలు చెంగ్ లీ-వున్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి భేటీలో శాంతి స్థాపనపై చర్చలు జరిగాయి. ఈ భేటీకి కొనసాగింపుగానే తాజా చర్యలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
విమాన ప్రయాణాలు, వంతెనల నిర్మాణం
చైనా-తైవాన్ మధ్య గతంలో ఆగిపోయిన సంబంధాలను మళ్లీ మొదలుపెట్టేందుకు చైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. షియాన్, ఉరుమ్‌కీ వంటి ప్రధాన నగరాల నుంచి తైవాన్‌కు నేరుగా విమానాలను నడపాలని యోచిస్తోంది. అలాగే చైనాకు అత్యంత దగ్గరగా ఉండే తైవాన్ ద్వీపాలు మత్సు, కిన్మెన్‌లను కలుపుతూ వంతెన నిర్మించాలనే పాత ప్లాన్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. అయితే పర్యాటకుల రాకపై ఉన్న ఆంక్షల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం చైనా ప్రజలు ఇతర దేశాల వీసాలు ఉంటే తప్ప తైవాన్ వెళ్లలేని పరిస్థితి ఉంది.
రైతులకు ఊరట
గత కొన్నేళ్లుగా తైవాన్ నుంచి వచ్చే వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. 2021లో అనాస పండ్ల దిగుమతిని ఆపగా, ఆ తర్వాత గ్రూపర్ ఫిష్, స్క్విడ్, ట్యూనా వంటి చేపల దిగుమతులను కూడా నిలిపివేసింది. అయితే ఇప్పుడు వీటి దిగుమతులను మళ్లీ అనుమతించేందుకు చైనా అంగీకరించింది. దీనివల్ల తైవాన్ మత్స్యకారులకు, రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.
తైవాన్ అప్రమత్తం.. మార్కెట్ల వైవిధ్యం
చైనా తాజా ప్రకటనపై తైవాన్ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. చైనా కొన్ని సంస్థలకు మాత్రమే అనుమతులు ఇస్తూ వివక్ష చూపుతోందని తైవాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ గతంలోనే విమర్శించింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చైనాపైనే ఆధారపడకుండా, ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మార్కెట్‌ను విస్తరిస్తామని తైవాన్ శనివారం స్పష్టం చేసింది.
2016లో సాయ్ ఇంగ్-వెన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనా-తైవాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. తైవాన్‌ను తన భూభాగంగా భావించే చైనా.. నిరంతరం సైనిక విమానాలతో గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతూ ఒత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విపక్ష నేత పర్యటన వేళ ఈ సడలింపులు ఇవ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
