
తైవాన్‌కు 700 మిలియన్ డాలర్ల రక్షణ క్షిపణి వ్యవస్థను విక్రయించిన అమెరికా
తైవాన్‌కు సుమారు 700 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.6,198 కోట్లు) విలువైన అధునాతన క్షిపణి వ్యవస్థ విక్రయించినట్లు అమెరికా ప్రకటించింది. ఇది ఒకే వారంలో తైవాన్‌కు అమెరికా ప్రకటించిన రెండవ ఆయుధ ప్యాకేజీ కాగా, దీంతో మొత్తం విక్రయ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ప్రకటనతో తైవాన్‌కు అమెరికా మద్దతు మరోసారి స్పష్టమైంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఈ వ్యవస్థను ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండోనేషియా మాత్రమే ఉపయోగిస్తున్నాయి. గత సంవత్సరం 2 బిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాల్లో భాగంగా తైవాన్ మూడు నాసామ్స్ వ్యవస్థలను పొందుతుందని అమెరికా తెలిపింది. నాసామ్స్ (నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్) అనే ఈ మధ్య-దూర వైమానిక రక్షణ వ్యవస్థలను ఆర్టీఎక్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఇవి తైవాన్‌కు కొత్త ఆయుధాలు.
పెంటగాన్ ప్రకారం, ఆర్టీఎక్స్ కు నాసామ్స్ యూనిట్ల కొనుగోలుకు ఫిక్స్‌డ్ ప్రైస్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ పనులు 2031 ఫిబ్రవరిలో పూర్తవుతాయని అంచనా. "2026 ఆర్థిక సంవత్సర తైవాన్ విదేశీ సైనిక అమ్మకాల ఫండ్స్‌లో నుంచి 698,948,760 డాలర్లు విడుదలయ్యాయి" అని పెంటగాన్ పేర్కొంది. ఈ నాసామ్స్ వ్యవస్థను రష్యా దాడి నుండి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌లో ఇప్పటికే ఉపయోగించారు. ఇది యుద్ధంలో పరీక్షించబడిన వ్యవస్థగా గుర్తింపు పొందింది.
తైపీలోని అమెరికా రాయబారి రేమండ్ గ్రీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ అమెరికా తైవాన్‌కు ఇచ్చే హామీలు అత్యంత బలంగా, స్థిరంగా ఉంటాయి. తైవాన్ శాంతిని బలంతో పరిరక్షించుకునేందుకు అమెరికా స్పష్టమైన చర్యలు తీసుకుంటోంది. రక్షణ పరిశ్రమలో సహకారం దీనికి ఉదాహరణ” అని పేర్కొన్నారు.
గత గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఫైటర్ జెట్, ఇతర విమాన భాగాల కోసం 330 మిలియన్ డాలర్ల విక్రయానికి ఆమోదం తెలిపారు. ఈ ఆయుధాల విక్రయంపై తైపీ కృతజ్ఞతలు తెలుపగా, చైనా మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చైనా ఉద్రిక్తతల మధ్య విక్రయాలు
చైనా తన సొంత భూభాగంగా పేర్కొంటున్న తైవాన్‌పై బీజింగ్ తరచుగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఆయుధ విక్రయాలు జరిగాయి. ఇటీవల చైనా తీర రక్షక నౌకలు జపాన్ నియంత్రణలో ఉన్న దీవుల చుట్టూ ఉన్న జలాల గుండా ప్రయాణించాయి. అలాగే చైనా ఒక డ్రోన్‌ను తైవాన్, జపాన్ పశ్చిమాన ఉన్న యొనాగుని ద్వీపం మధ్య ఎగురవేయడంతో జపాన్ ఫైటర్ జెట్‌లను పంపించాల్సి వచ్చింది. చైనా సైన్యం దాదాపు ప్రతిరోజూ తైవాన్ చుట్టూ కార్యకలాపాలు నిర్వహిస్తూ, తైపీ సైన్యాన్ని పరీక్షించడానికి 'గ్రే జోన్' వ్యూహాన్ని ఉపయోగిస్తున్నట్లు కూడా తైవాన్ భావిస్తోంది.
తైవాన్ స్పందన
ఈ ఉద్రిక్తతపై తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్‌కూ స్పందిస్తూ, వివాదాలను పరిష్కరించడానికి చైనా బలాన్ని ఉపయోగించకూడదని హితవు పలికారు. చైనా నుండి వచ్చే ఏ దాడినైనా ఎదుర్కోవడానికి తైవాన్ తన ఆయుధాలను బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా కీలకమైన సముద్ర సరఫరా మార్గాలను రక్షించుకోవడానికి సొంతంగా జలాంతర్గాములను నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది.
తైవాన్‌కు అమెరికా సాయం చేయడానికి ప్రధాన కారణం ప్రాంతీయ స్థిరత్వం, భౌగోళిక రాజకీయ వ్యూహం. చైనాతో అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, 1979 నాటి తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం, తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ సామగ్రిని అందించడానికి అమెరికా చట్టబద్ధంగా కట్టుబడి ఉంది. తైవాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉండటం, అది ఒక కీలకమైన సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా ఉండటం వలన కూడా అమెరికా మద్దతు ఇస్తోంది. తైవాన్‌కు అమెరికా దగ్గరైతే, దాని ముఖ్య ప్రత్యర్థి అయిన చైనా నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావొచ్చు. ఇది తైవాన్ జలసంధిలో సైనిక ఉద్రిక్తతలు, ఆసియా ప్రాంతంలో మొత్తం భౌగోళిక రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
