
తైవాన్‌కు 10 బిలియన్ డాలర్లకు పైగా ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం
తైవాన్ దేశ రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక ఆయుధాలను తైవాన్‌కు విక్రయించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ఆయుధ ప్యాకేజీలో క్షిపణులు, రాకెట్ వ్యవస్థలు, హోవిట్జర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యుద్ధ పరికరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
తైవాన్‌కు మొత్తం ఎనిమిది రకాల ఆయుధ ప్యాకేజీలను విక్రయించనున్నారు. వీటి మొత్తం అంచనా వ్యయం సుమారు 11.1 బిలియన్ డాలర్లు. ఈ ప్యాకేజీలో ప్రధానంగా హిమార్స్ రాకెట్ వ్యవస్థలు, యాంటీ-ట్యాంక్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లు, హోవిట్జర్ ఫిరంగులు ఉన్నాయి. ఈ ఆయుధాలలో ఐదు ప్యాకేజీలు ఇప్పటికే తైవాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రక్షణ బడ్జెట్‌లో భాగంగా ఉన్నాయి. సుమారు 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ బడ్జెట్‌కు తైవాన్ పార్లమెంట్ నుండి తుది ఆమోదం లభించాల్సి ఉంది.
అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఈ ఆయుధాల విక్రయానికి సంబంధించి అవసరమైన ధ్రువీకరణలను పూర్తి చేసి, అమెరికా కాంగ్రెస్‌కు అధికారికంగా నివేదించింది. ఈ సందర్భంగా డీఎస్‌సీఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఈ ఆయుధాల విక్రయం తైవాన్ భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వాన్ని, సైనిక సమతుల్యతను, ఆర్థిక పురోగతిని కాపాడటానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది” అని పేర్కొంది.
తైవాన్ కృతజ్ఞతలు
ఈ నిర్ణయంపై తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ చియా-లుంగ్ స్పందిస్తూ అమెరికాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "తైవాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో అమెరికాకు ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం మరోసారి చాటిచెప్పింది" అని ఆయన కొనియాడారు.
ఏ ఆయుధాలు కొనుగోలు చేయనుంది?
తైవాన్ కొనుగోలు చేయనున్న ఈ భారీ ఆయుధ ప్యాకేజీలో యుద్ధ భూమిలో కీలకమైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 82 హిమార్స్ రాకెట్ లాంచర్లు, 420 ఏటీఏసీఎంఎస్ క్షిపణులు, గైడెడ్ రాకెట్ సిస్టమ్స్, వివిధ రకాల సైనిక వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు మెషిన్ గన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫ్రీక్వెన్సీ-హోపింగ్ రేడియోలు, భారీ సైనిక ట్రక్కులను కూడా కొనుగోలు చేయనున్నారు. కేవలం ఈ ఒక్క ప్యాకేజీ విలువనే సుమారు 4.05 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. కేవలం ఆయుధాలే కాకుండా, వాటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహాయం, శిక్షణ, లాజిస్టిక్ మద్దతును కూడా అమెరికా అందించనుంది.
తైవాన్ రక్షణ ఖర్చులు పెరుగుతున్నాయ్
తైవాన్ రక్షణ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే గత నెలలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 నుంచి 2033 వరకు అమలయ్యేలా సుమారు 40 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ బడ్జెట్‌ను ఆయన ప్రకటించారు. మరోవైపు, అమెరికా సెనేట్ తాజాగా ‘నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్’ను ఆమోదించి తైవాన్‌కు తన మద్దతును చాటుకుంది. ఈ బిల్లు ప్రకారం 2026 సంవత్సరంలో తైవాన్ భద్రతా సహకారం కోసం అమెరికా 1 బిలియన్ డాలర్ల వరకు నిధులను కేటాయించనుంది. అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో తైవాన్‌కు భాగస్వామ్యం కల్పించేలా అమెరికా ఈ చట్టంలో ప్రత్యేక నిబంధనలను కూడా చేర్చింది.
చైనా సవాళ్లు - అమెరికా వ్యూహం
ఈ రక్షణ ఒప్పందాలు, నిధుల కేటాయింపులన్నీ చైనా నుండి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, రష్యా వంటి దేశాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మిత్రదేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం అత్యవసరమని అమెరికా నేతలు అభిప్రాయపడుతున్నారు. తైవాన్ వంటి వ్యూహాత్మక భాగస్వాములకు అత్యాధునిక ఆయుధాలను అందించడం ద్వారా, ఆ ప్రాంతంలో సైనిక సమతుల్యతను కాపాడటమే కాకుండా శత్రు దేశాలను నిలువరించవచ్చని అమెరికా విశ్వసిస్తోంది.
