Let's talk: editor@tmv.in
తైపూసం పండుగకు ముస్లిం వ్యాపారి ఉదార దానం

తైపూసం పండుగకు ముస్లిం వ్యాపారి ఉదార దానం

Pinjari Chand
1 ఫిబ్రవరి, 2026

దేశంలో రోజురోజూకీ మతకల్లోలాలు పెరుగుతున్న వేళ ఓ ముస్లిం వ్యక్తి ఓ హిందూ ఉత్సవంలో అన్నదాన కార్యక్రమానికి భారీ ఉదార దానం చేశారు. ఇలా చేయడం సుమారు 20–25 సంవత్సరాల నుంచి ఈ విధంగానే చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మతసామరస్యాన్ని మరింత పెంచనున్నాయి.

దేశంలో మత సామరస్యానికి మరో బలమైన ఉదాహరణగా, కడలూరు జిల్లా వడలూరులో జరిగే ప్రతిష్ఠాత్మక తైపూసం జ్యోతి దర్శనం పండుగ సందర్భంగా ఓ ముస్లిం కూరగాయల వ్యాపారి లక్షల రూపాయల విలువైన ఆహార సామగ్రిని విరాళంగా అందించారు. సెంట్ రామలింగ అడిగల్ (వల్లలార్) స్థాపించిన వల్లలార్ సత్యజ్ఞాన సభలో ప్రతి సంవత్సరం నిర్వహించే తైపూసం జ్యోతి దర్శనం పండుగకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ పండుగ సందర్భంగా 3 నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వడలూరు చేరుకుంటారని అంచనా. ఈ సమయంలో జరిగే అన్నదానం ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కొనసాగుతుంది.

రెండు దశాబ్దాలకు పైగా

ఈ అన్నదానానికి కడలూరు పట్టణానికి చెందిన ముస్లిం హోల్‌సేల్ కూరగాయల వ్యాపారి బక్కీ రామ్ ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో సహకారం అందించారు. గత 20–25 ఏళ్లుగా ఆయన ఈ సేవను కొనసాగిస్తుండగా, ఈసారి విరాళం మరింత విస్తృతంగా ఉండటం విశేషం. ఈ ఏడాది ఆయన అందించిన విరాళంలో 18 టన్నుల కూరగాయలు, 100 బస్తాల బియ్యం, భారీగా వంటకు అవసరమైన కిరాణా సరుకులు, 7,500 తాగునీటి బాటిళ్లు ఉన్నాయి. కడలూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జీఆర్‌కే తంబు దురైరాజ్ బక్కీ రామ్ సేవలను ప్రశంసిస్తూ మా సభ్యుడు బక్కీ రామ్ ముస్లిం అయినప్పటికీ, గత 20–25 సంవత్సరాలుగా వడలూరు వల్లలార్ సభకు అవసరమైన కూరగాయలు, కిరాణా సరుకులు అందిస్తున్నారు. ఇది హిందూ–ముస్లిం సమాజాల మధ్య ఉన్న సోదరభావానికి ప్రతీక అని అన్నారు.

వడలూరులో రోజూ 2–3 లక్షల మంది భక్తులకు అన్నదానం జరుగుతుండగా, ప్రభుత్వంతో పాటు ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో బక్కీ రామ్ సహకారం కీలకంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న జరగనున్న తైపూసం జ్యోతి దర్శనం పండుగను దృష్టిలో ఉంచుకుని, భక్తుల రాకపోకల సౌకర్యార్థం కడలూరు జిల్లా యంత్రాంగం స్థానిక సెలవు ప్రకటించింది. ఒక ముస్లిం దాత హిందూ ఆధ్యాత్మిక సంస్థకు నిరంతరంగా సేవలందించడం, మతభేదాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వడలూరు తైపూసం పండుగ వేళ బక్కీ రామ్ చేసిన ఈ ఉదార సేవ, తమిళనాడు సంస్కృతిలోని సామరస్య భావానికి అద్దం పడుతోంది.