Let's talk: editor@tmv.in
తేరుకుంటున్న కరూర్

తేరుకుంటున్న కరూర్

Pinjari Chand
9 అక్టోబర్, 2025

కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన సుమారు 11 రోజుల తరువాత అక్కడి వేలుస్వామిపురంలోని దుకాణాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో దుకాణ యజమానులు తిరిగి వస్తున్నారు. విరిగిపోయిన రేకులను, దెబ్బతిన్న దుకాణాలను సరిచేసుకుంటున్నారు. కొంతమంది షాపుల పైకప్పులు పూర్తిగా దెబ్బతినడంతో తమకు నష్టపరిహారం అందించాలని తమిళవెట్రికళగం(టీవీకే) వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్​ ను బాధితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా జేయమణి స్థానికి దుకాణ యజమాని తన దుకాణ మరమ్మతులకు కనీసం రూ.3 లక్షలు ఖర్చవుతుందని, తమను ఆదుకోవాలని కోరారు.

విషాద వాతావరణం

టీవీకే ప్రచార ర్యాలీ సందర్భంగా సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. సుమారు 110 మంది గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు చాలామంది తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. అయితే నాటి సంఘటన గుర్తులు నేటికీ అక్కడ ఉన్నాయి. పేరుకుపోయిన చెప్పుల కుప్పలు, పార్టీ కరపత్రాలు, వ్యక్తిగత వస్తువులు, చినిగిపోయిన వస్త్రాలతో ఆ ప్రాంతమంతా భీతావహాంగా ఉండింది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తున్నారు.

సిట్ నియామకం

తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని నియమించింది. రిటైర్డ్​ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. సంఘటన స్థలంలో నిరంతర భద్రతకు, దర్యాప్తు కోసం పోలీసు సిబ్బందిని నియమించారు.

నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి

తొక్కిసలాటకు సంబంధించి దర్యాప్తును సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో నిష్పక్షపాతంగా జరపాలని టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. పిటిషన్‌లో మద్రాస్ హైకోర్టు రాష్ట్ర పోలీసులపై నమ్మకంలేదని స్పష్టంగా వ్యాఖ్యానించినప్పటికీ అదే పోలీసు అధికారులతో సిట్ ను నియమించినందున, సిట్​ టీవీకే కు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తేరుకుంటున్న కరూర్ - Tholi Paluku