Let's talk: editor@tmv.in
తేజస్వీని సీఎంగా ఎవరు ప్రకటించారు: చిరాగ్

తేజస్వీని సీఎంగా ఎవరు ప్రకటించారు: చిరాగ్

Pinjari Chand
19 అక్టోబర్, 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ క్రమంగా రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మహాఘట్బంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించిందెవరు? అని ప్రశ్నించారు. తేజస్వీ పేరును ధృవీకరించిందెవరు? వారి కూటమి కూడా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్గత విభేదాలతో నిండిన కూటమి బీహార్ అభివృద్ధి చేయలేదు. ప్రజలు అలాంటి నాయకత్వాన్ని అంగీకరించరని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. కూటమిలోనే విబేధాలు ఉన్నాయి. వారే సరిగా సీట్లను పంచుకోలేదు. వారే అభ్యర్థులక సరైన న్యాయం చేయలేదు. ఏ విధంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని తేజస్వీని చిరాగ్ ప్రశ్నించారు.

ఒకే నియోజకవర్గంలో ఘట్బంధన్ నుంచి ఇరువురు అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. వారు ఎన్నికల్లో పోటీచేయడానికే సందిగ్ధ పడుతుంటే రాష్ట్రాన్ని ఏవిధంగా పాలిస్తారు. ఇదంతా అయ్యే పని కాదు. ఎన్డీయే కూటమి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నవారు ప్రచారం నిర్వహించుకుంటున్నారు. వారేమో ఇంకా సీట్లపైనే చర్చించుకుంటున్నారని మహాఘట్బంధన్ ను ఎద్దేవా చేశారు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం. నవంబర్‌‌ 14న అధికారంలోకి వస్తాం ఆరోజు దేశం మొత్తం దివాళి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన తరువాతే సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్డీయే నిర్ణయిస్తుందని, ప్రస్తుతానికి నితీశ్ నాయకత్వంలోనే ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పట్నాలో కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే తరఫున కీలక నియోజకవర్గాల్లో వ్యూహరచనపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించబోతున్నామన్నారు.

తేజస్వీకి మద్దతు ఇవ్వాలి

ఇదే సమయంలో, శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది తేజస్వీ యాదవ్‌ను ప్రజాదరణ పొందిన నాయకుడిగా అభివర్ణిస్తూ, మహాఘట్బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో చేసిన తప్పులు బీహార్‌లో పునరావృతం కాకూడదు. తేజస్వీ యాదవ్ బలమైన అభ్యర్థి, కూటమి ఆయనకు మద్దతు ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించారు.ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 48 అభ్యర్థులు ఉన్న ఈ జాబితాలో 24 మంది తొలి దశలో, మరో 24 మంది రెండవ దశలో పోటీ చేయనున్నారు. బీహార్‌లో 243 సీట్లకు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్ రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతుండగా, కూటముల్లో అంతర్గత విభేదాలు, ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిత్వం చుట్టూ చర్చలు ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

తేజస్వీని సీఎంగా ఎవరు ప్రకటించారు: చిరాగ్ - Tholi Paluku