Let's talk: editor@tmv.in
తెలుసుకోవడమే శక్తి - సమాచార హక్కు చట్టం 2005

తెలుసుకోవడమే శక్తి - సమాచార హక్కు చట్టం 2005

Dantu Vijaya Lakshmi Prasanna
29 అక్టోబర్, 2025

“ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత నిర్మించబడిన రాజ్యమైతే, సమాచారమే దాని ఆత్మ.” ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల గదులు మూసివున్న తలుపుల్లా ఉండేవి. ప్రజల ప్రశ్నలకు సమాధానాల బదులు నిశ్శబ్దం మాత్రమే వినిపించేది. ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రజా నిధులు ఎక్కడ వినియోగమవుతున్నాయి? ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి, ఎన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి? ఇవన్నీ రహస్యాలుగా మిగిలిపోయేవి. ఆ చీకటిలో వెలుగునింపిన చట్టమే సమాచార హక్కు చట్టం 2005.

ఇది ప్రజలకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది, సమాధానం కోరే శక్తి ఇచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కేవలం మాటల్లో కాకుండా, ప్రజల చేతిలో పెట్టిన సాధనంగా మార్చింది. ఇది ప్రతి భారత పౌరునికి “తెలుసుకోవడం” అనే శక్తిని ఇచ్చింది. అది భయాన్ని కాదు, బాధ్యతను కలిగించే శక్తి.

సమాచార హక్కు చట్టం - ఉద్దేశ్యం

ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం, ప్రజలకు ప్రభుత్వంలోని సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం. ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వం నిజమైన అర్థంలో ప్రజలది అవుతుంది. ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల నుండి, శాఖల నుండి, అధికారుల నిర్ణయాల నుండి వాస్తవాలు, పత్రాలు, గణాంకాలు, కారణాలు పొందగలరు. ఇది అవినీతి తగ్గించడానికి, న్యాయాన్ని బలపరచడానికి, ప్రజల నమ్మకాన్ని పెంచడానికి రూపొందించబడింది.

ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే ప్రజలకు సరైన సమాచారం అవసరం. సమాచార పారదర్శకత అవినీతి తగ్గించడానికి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల పర్యవేక్షణకు అత్యవసరం. అదే సమయంలో, కొన్ని అంశాలు గోప్యతకు సంబంధించినవి (భద్రత, రహస్య వ్యవహారాలు) కాబట్టి, పారదర్శకత మరియు రహస్యత మధ్య సమతౌల్యం అవసరం. ఈ చట్టం ప్రజలకు సమాచారాన్ని అడిగే చట్టబద్ధ హక్కును ఇస్తుంది, ప్రభుత్వ సంస్థలు ముందుగానే కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాలని బలవంతం చేస్తుంది,

సమాచార కమిషన్ల ద్వారా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పరుస్తుంది.

చట్టంలోని ప్రధాన భాగాలు

అధ్యాయం - I : ఇందులో లో ప్రాథమిక నిర్వచనాలు ఉంటాయి. సమాచార హక్కు చట్టం - 2005, ఇది దేశవ్యాప్తంగా అమలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలకు వర్తింపు అనే విషయాలను తెలుపుతుంది. “పబ్లిక్ అథారిటీ”, “ఇన్ఫర్మేషన్”, “రికార్డ్”, “రైట్ టు ఇన్ఫర్మేషన్” వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు ఉంటాయి.

అధ్యాయం - II : ఇందులో పౌరుల హక్కులు, ప్రభుత్వ బాధ్యతలు ఉంటాయి. ప్రతి పౌరుడికి సమాచార హక్కు ఉంది. ప్రభుత్వ విభాగాలు తమ పనితీరుకు సంబంధించిన వివరాలు, నిర్ణయాలు, నియమాలు, ఆర్థిక వివరాలు ప్రజలకు వెల్లడించాలి. ప్రతి కార్యాలయంలో సమాచార అధికారులను నియమించాలి. పౌరుడు ఏ కారణం చెప్పకుండానే సమాచారం అడగవచ్చు. సమాచారం 30 రోజుల్లోపు ఇవ్వాలి. “జీవితం లేదా భద్రత”కు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లో ఇవ్వాలి. కొన్ని సున్నితమైన విషయాలు (జాతీయ భద్రత, వ్యాపార రహస్యాలు మొదలైనవి) మినహాయింపు పొందుతాయి, అనే అంశాలు ఉంటాయి.

అధ్యాయం - III : ఇందులో కేంద్ర సమాచార సంఘం సమాచారం పొందుపరిచారు. దేశ స్థాయిలో ముఖ్య సమాచార కమిషనర్ ,సమాచార కమిషనర్లు నియామకం ఉంటాయి. వీరిని అధ్యక్షుడు నియమిస్తారు. వీరు స్వతంత్రంగా విచారణలు చేసి, పౌరుల ఫిర్యాదులను పరిష్కరిస్తారు అనే అంశాలి ఉంటాయి.

అధ్యాయం IV : ఈ అధ్యాయం రాష్ట్ర సమాచార సంఘం గురించి వెల్లడిస్తుంది. ఇది ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర సమాచార సంఘం ఏర్పాటు. ముఖ్య కమిషనర్, కమిషనర్లు గవర్నర్ ద్వారా నియమించబడతారు. ప్రజల ఫిర్యాదులు, అప్పీలు, సమాచార ఆలస్యం వంటి అంశాలను తెలుపుతుంది.

అధ్యాయం - V : కమిషన్ అధికారాలు, అప్పీలు, శిక్షలు ఉంటాయి. పౌరుడు సమాధానం రాకపోతే మొదట మొదటి అప్పీల్, తర్వాత రెండవ అప్పీల్ వేయవచ్చు. కమిషన్ విచారణలో కోర్ట్ అధికారాలు కలిగి ఉంటుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తప్పు చేస్తే రోజుకు ₹250, గరిష్ఠంగా ₹25,000 వరకు జరిమానా విధించవచ్చు అనే అంశాలు ఇందులో పొందుపరిచారు.

అధ్యాయం–V :ఇతర నిబంధనలు అనగా చట్టాన్ని నిష్కపటంగా అమలు చేసే అధికారులను రక్షిస్తుంది. ఈ చట్టం అఫిషియల్ సెక్రెట్స్ యాక్ట్, 1923 వంటి పాత రహస్య చట్టాల కంటే ప్రాధాన్యంగా ఉంటుంది. కొన్ని రహస్య సంస్థలు (ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ) మినహాయింపు పొందినా, అవినీతి లేదా మానవహక్కుల ఉల్లంఘన అంశాలపై సమాచారం ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు, కమిషన్లు ప్రతి సంవత్సరం అమలు నివేదిక ఇవ్వాలి. శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఈ అధ్యాయం వివరిస్తుంది.

మరిన్ని ముఖ్యాంశాలు: ప్రజలకు సమాచార హక్కు చట్టబద్ధమైనది. అధికారులు ముందుగానే సమాచారం ప్రజలకు అందించాలి. గోప్యత అవసరమైన అంశాలకు మాత్రమే మినహాయింపులు. ఎటువంటి కారణం చెప్పకుండా సమాచారం అడగవచ్చు. సమయపరిమితి, జరిమానా నిబంధనలు ఉన్నాయి. స్వతంత్ర కమిషన్లు పర్యవేక్షణ చేస్తాయి. గూఢచార సంస్థల మినహాయింపు పరిమితంగానే ఉంటుంది. శిక్షణ, పర్యవేక్షణ, నివేదికల ద్వారా చట్టం అమలు బలపడుతుంది.

పరిమితులు, ఆచరణలో సమస్యలు

కొన్ని సమాచారం గోప్యత కారణంగా ఇవ్వరు. రికార్డుల నిర్వహణ బలహీనంగా ఉంటే, సమాచారం పొందడం కష్టం. కొన్ని శాఖల్లో PIOలు లేకపోవడం లేదా అవగాహన లేకపోవడం సమస్య. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ నిధులు పొందకపోతే, వాటిపై RTI వర్తించదు. కంప్యూటరైజేషన్ అన్ని చోట్ల పూర్తి కాలేదు.

ఇది భారత ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం. ఎందుకంటే ఇది ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఇస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థను పారదర్శకంగా, జవాబుదారిగా మారుస్తుంది.

భారతదేశంలో సమాచార హక్కు చట్టం, 2005, అనేది పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా, పౌరులకు ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే అధికారాన్ని ఇచ్చే ఒక కీలకమైన చట్టం.

RTI చట్టం యొక్క ప్రధాన లక్ష్యం సమాచారం తెలిసిన పౌరులను సృష్టించడం మరియు అవినీతిని అరికట్టడం. అధికారుల నుండి పౌరులకు అధికారాన్ని బదిలీ చేయడం ద్వారా ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో పనిచేసేలా చేయడం దీని లక్ష్యం. ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలియకుండా ఎవరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు కాబట్టి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) (వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ) నుండి ఈ సమాచార హక్కు పుడుతుందని సుప్రీంకోర్టు భావిస్తుంది.

దీని నిర్దిష్ట లక్ష్యాలు:

సాధికారత: ప్రభుత్వ నిర్ణయాలు మరియు చర్యలను ప్రశ్నించే అధికారాన్ని పౌరులకు ఇవ్వడం.

జవాబుదారీతనం: ప్రభుత్వ ఉద్యోగులు మరియు అధికారులను మరింత బాధ్యతాయుతంగా మరియు చురుకుగా ఉండేలా చేయడం.

సుపరిపాలన: పరిపాలనా రహస్యాలను తగ్గించి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రజల పరిశీలనకు తెరవడం.

ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించాలి

భారతదేశంలోని ఏ పౌరుడైనా 'పబ్లిక్ అథారిటీ' (ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ-యాజమాన్యంలోని సంస్థలు మరియు ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు) నుండి సమాచారాన్ని కోరవచ్చు.

పబ్లిక్ అథారిటీని గుర్తించడం: మొదట, దరఖాస్తుదారు తనకు అవసరమైన సమాచారాన్ని కలిగి ఉన్న నిర్దిష్ట కేంద్ర లేదా రాష్ట్ర పబ్లిక్ అథారిటీని (ఉదాహరణకు, రోడ్ల సమస్యల కోసం మున్సిపల్ కార్పొరేషన్, పాస్‌పోర్ట్ స్థితి కోసం పాస్‌పోర్ట్ కార్యాలయం) గుర్తించాలి.

దరఖాస్తు సమర్పణ: సంబంధిత అథారిటీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కు లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్‌గా అభ్యర్థన చేయాలి. దరఖాస్తు ఇంగ్లీష్, హిందీ లేదా ఆ ప్రాంత అధికారిక భాషలో ఉండవచ్చు.

రుసుము చెల్లింపు: దరఖాస్తుతో పాటు నామమాత్రపు రుసుము సాధారణంగా 10 రూపాయలు చెల్లించాలి.

కారణం చెప్పనవసరం లేదు: ముఖ్యంగా, దరఖాస్తుదారు సమాచారం ఎందుకు అడుగుతున్నారో కారణం చెప్పనవసరం లేదు.

ప్రతిస్పందన సమయం: పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దరఖాస్తు అందిన 30 రోజుల్లోపు కోరిన సమాచారాన్ని అందించాలి. ఒకవేళ సమాచారం ఒక వ్యక్తి యొక్క జీవితం లేదా స్వేచ్ఛకు సంబంధించినదైతే, దానిని 48 గంటలలోపు అందించాలి.

అప్పీళ్లు:

• PIO అభ్యర్థనను తిరస్కరించినా లేదా ప్రతిస్పందించడంలో విఫలమైనా, పౌరుడు అదే ప్రభుత్వ సంస్థలోని సీనియర్ అధికారి అయిన మొదటి అప్పీలేట్ అథారిటీ కి మొదటి అప్పీల్ చేయవచ్చు.

• FAA నిర్ణయం సంతృప్తికరంగా లేకపోతే, కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండవ అప్పీల్ చేయవచ్చు. చట్టం ప్రకారం ఇది అత్యున్నత మరియు తుది అప్పీల్ అధికారం.

సమాచార హక్కు చట్టం దుర్వినియోగం

సమాచార హక్కు చట్టానికి కీలక పాత్ర ఉన్నప్పటికీ, ఈ చట్టం కొన్నిసార్లు దుర్వినియోగం చేయబడుతోంది. ఇది ప్రభుత్వ వనరులు, పరిపాలనా పనితీరుపై అనవసరమైన భారాన్ని మోపుతుంది.

• కొంతమంది దరఖాస్తుదారులు అధికారులను వేధించడానికి లేదా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా, భారీగా లేదా అల్పమైన పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు దాఖలు చేస్తారు. ఇది కీలకమైన ప్రజా విధులకు కేటాయించాల్సిన సమయాన్ని, వనరులను అధికంగా మళ్లిస్తుంది.

• చట్టం ద్వారా అక్రమ చర్యల గురించి (ఉదాహరణకు, అక్రమ నిర్మాణ అనుమతులు) సమాచారాన్ని పొందిన వారు, ఆ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడిస్తామని లేదా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి, తప్పు చేసిన వారి నుండి డబ్బు లేదా వ్యక్తిగత అనుకూలతలను పొందడానికి బ్లాక్‌మెయిలింగ్ కోసం దీనిని దుర్వినియోగం చేయవచ్చు.

• వ్యక్తిగత, ప్రజా ప్రయోజనం లేని వివాదాలలో (భార్యాభర్తల మధ్య, పొరుగువారి మధ్య) వ్యక్తిగత సమాచారాన్ని కోరడానికి ఈ చట్టాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుంది.

• దరఖాస్తుదారులు కొన్నిసార్లు నిర్దిష్ట సమాచారాన్ని కోరడానికి బదులుగా, ఏదైనా చిన్న పొరపాటు దొరుకుతుందేమోనని ఆశించి, విస్తృత, సాధారణ విచారణలను ప్రారంభించడానికి ఈ చట్టాన్నిఉపయోగిస్తారు.

దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు

దుర్వినియోగాన్ని తగ్గించడానికి చట్టంలో న్యాయపరమైన వివరణలు రక్షణ చర్యలలు ఉన్నాయి.

మినహాయింపులు (సెక్షన్ 8): : పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, వాణిజ్య విశ్వాసం వంటి వర్గీకరించబడిన లేదా ఒక వ్యక్తి గోప్యతపై అనవసరంగా దాడి చేసే సమాచారాన్ని అందించడానికి నిరాకరించవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగత లేదా దురుద్దేశపూర్వక అభ్యర్థనలను నిరోధిస్తుంది.

వనరుల విపరీతమైన మళ్లింపు: దరఖాస్తును నెరవేర్చడం వల్ల పబ్లిక్ అథారిటీ యొక్క "వనరులు విపరీతంగా మళ్లింపు" అవుతుందని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ భావిస్తే, అటువంటి అభ్యర్థనను తిరస్కరించవచ్చు. ఇది అధిక సంఖ్యలో లేదా అసంబద్ధమైన అభ్యర్థనలను అరికడుతుంది.

అప్పీలేట్ సమీక్ష: అసలు దరఖాస్తు నిరాధారమైనదిగా, బాధాకరమైనదిగా లేదా నిజమైన ప్రజా ప్రయోజనం లేకుండా దాఖలు చేయబడిందని గుర్తిస్తే, సమాచార కమిషన్లు అప్పీళ్లను కొట్టివేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి.

సమాచారం అంటే కేవలం పత్రాలు కాదు. అది ప్రజాస్వామ్య ప్రాణవాయువు. RTI చట్టం ద్వారా భారత ప్రజలకు తమ పాలనపై దృష్టి పెట్టే శక్తి వచ్చింది. ఈ చట్టం చెప్పే సందేశం ఒకటే, “తెలుసుకో, ప్రశ్నించు, సమాధానం పొందు ఇదే ప్రజాస్వామ్యపు నిబద్ధత.”