Let's talk: editor@tmv.in
తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
20 జులై, 2026

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డుల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, విశేష విజయాలు సాధించిన తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు.. జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్న తెలుగు నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అందజేశారు. వారి అసాధారణ విజయాలు తెలుగు సినిమాకు ఎనలేని గర్వకారణంగా నిలిచాయని కొనియాడారు. కళ, సంస్కృతి, సినిమా అనేవి మన రాష్ట్ర అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వతమైన మూలస్తంభాలని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు చలనచిత్ర రంగం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ అద్భుతమైన ప్రతిభతో రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. అవార్డు గ్రహీతలందరూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రశంసలు అందుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ చలనచిత్ర విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు, గాయనీగాయకులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు మమ్ముట్టి నాలుగోసారి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం విశేషమని పేర్కొంటూ, ఆయనతో పాటు ఉత్తమ నటుడిగా ఎంపికైన కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటిగా నిలిచిన యామీ గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో జాతీయ పురస్కారాలు రావడం గర్వకారణమని పవన్ అన్నారు. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఏడీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు నితిన్ జిహాని చౌదరి, ఉత్తమ బాలల చిత్రంగా 35-చిన్న కథ కాదు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సుకుమార్ (పుష్ప-2), ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు దీపాలి నూర్, శీతల్ శర్మ ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, దర్శకుడు యదు వంశీకి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన పి. రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా ఎంపిక కావడం తెలుగు సినీ పరిశ్రమకు మరో గౌరవమని పవన్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
72ndNationalFilmAwardsNationalFilmAwardsTeluguCinemaTollywoodCommitteeKurrolluNiharikaKonidelaKalki2898ADPushpa2LuckyBhaskarTeluguPrideIndianCinemaMammootty
తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: సీఎం చంద్రబాబు - Tholi Paluku