Let's talk: editor@tmv.in
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

Gaddamidi Naveen
31 డిసెంబర్, 2025

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఉన్న తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు, సేవలు, నైవేద్య సమర్పణలు ప్రారంభమై భక్తి పరవశ వాతావరణం నెలకొంది.

తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున 12.05 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి పునీతులయ్యారు. పది రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి స్వయంగా క్యూలైన్లలో పర్యటించి భక్తులతో ముచ్చటించి సౌకర్యాలను పర్యవేక్షించారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమాడ వీధుల్లో నిర్వహించిన స్వర్ణ రథోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఫలాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. శ్రీవారి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ‘శ్రీ రంగనాథ స్వామి’ ఆలయ సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పటిష్ట భద్రత కోసం 3,500 మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

మరోవైపు, వైకుంఠ ఏకాదశిని తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత శుభప్రదంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరుమలతో పాటు యాదగిరిగుట్ట, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణాలు భక్తి గీతాలు, గోవింద నామస్మరణతో మార్మోగాయి.

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి, అలాగే సర్వతోముఖాభివృద్ధి కోసం వారు ప్రార్థించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.

బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు స్వామి పుష్కరిణిలో నిర్వహించనున్న చక్రస్నానంతో ఈ పవిత్ర వేడుకలు మరో కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.