
తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డీజీజీఐ) అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో రూ. 217 కోట్ల భారీ పన్ను మోసం వెలుగుచూసింది. నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందుతున్న ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. విశాఖపట్నంలో విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
డేటా అనలిటిక్స్, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా డీజీజీఐ అధికారులు ఈ నెట్‌వర్క్‌ను గుర్తించారు. నిందితులు సుమారు 72 నకిలీ సంస్థలను సృష్టించి, ఎలాంటి వస్తువులు లేదా సేవలను సరఫరా చేయకుండానే రూ. 1,472 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. తద్వారా రూ. 217 కోట్ల ఐటీసీని అక్రమంగా పొందారు. అమాయక వ్యక్తుల ఆధార్, పాన్ కార్డు వివరాలను సేకరించి, వారిని యజమానులుగా చూపిస్తూ ఈ సంస్థలను రిజిస్టర్ చేశారు. తప్పుడు పత్రాలతో తాత్కాలిక భవనాలను అద్దెకు తీసుకుని, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందడమే కాకుండా బ్యాంక్ ఖాతాలను కూడా తెరిచారు. పని పూర్తయ్యాక ఆ ప్రాంగణాలను వదిలి వెళ్ళిపోయేవారు అని అధికారులు తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారానికి ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజిరెడ్డి) ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఇతడు పరారీలో ఉన్నాడు. జీఎస్టీ ఫైలింగ్స్, ఇన్వాయిస్ సృష్టి, క్రెడిట్ బదిలీలను సిండికేట్ కేంద్రీకృతంగా నియంత్రించినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్‌లను సీజీఎస్టీ చట్టం, 2017 ప్రకారం అరెస్టు చేశారు. నాగరాజు నాయక్ ప్రాంగణాల ఏర్పాటు, నకిలీ యజమానుల ఎంపిక బాధ్యతలు నిర్వహించగా, ప్రభాకర్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేసి సిస్టమ్ యాక్సెస్ అందించినట్టు వెల్లడైంది.
ఈ తరహా కార్యకలాపాలు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టడమే కాకుండా, నిజాయితీగా వ్యాపారం చేసేవారికి నష్టం కలిగిస్తాయని డీజీజీఐ పేర్కొంది. ఈ నేరాలు నాన్-బెయిలబుల్ అని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను, ఆర్థిక సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏజెన్సీ పునరుద్ఘాటించింది.
