
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విద్యా దేవత జన్మదినాన్ని పురస్కరించుకుని, తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు.
ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అమ్మవారిని దర్శించుకుని చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, వసతులు ఏర్పాటు చేశారు. చిన్నారుల కేరింతలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. వసంత పంచమి రోజు జ్ఞానదేవతైన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అనంతరం శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధిని మరింత పటిష్టంగా చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
ఈ క్రమంలోనే బాసర ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.200 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ మౌలిక వసతుల అభివృద్ధి, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, పారిశుధ్యం, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు.
అలాగే సమీప భవిష్యత్తులో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా సమగ్ర ఏర్పాట్లు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సునాయాస దర్శనం, భద్రత, మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి వేడుకలలో భాగంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమె తన చిన్నారికి అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి వంటి పవిత్రమైన రోజున విద్యా దేవత సన్నిధిలో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ పర్యవేక్షించారు.
ఇంద్రకీలాద్రిపై భక్తిజాతర.. సరస్వతీ రూపంలో దుర్గమ్మ దర్శనం!
పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని విద్యా క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంలో మెరిసిపోయిన అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. మరోవైపు నంద్యాల జిల్లాలోని కొలనుభారతి క్షేత్రంలోనూ వసంత పంచమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి.
లక్షలాదిగా తరలివచ్చిన విద్యార్థి లోకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం తెల్లవారుజాము నుంచే పండుగ వాతావరణం నెలకొంది. పరీక్షల్లో విజయం సాధించాలని, ఉజ్వల భవిష్యత్తు లభించాలని కోరుకుంటూ సుమారు 25 వేల మందికి పైగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యాప్రదాయినిగా అమ్మవారు దర్శనమివ్వడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆధ్యాత్మిక కాంతితో మహామండపం
పంచమి వేడుకల్లో భాగంగా ఆలయ ఆరో అంతస్తులోని మహామండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్రసాదాలను పంపిణీ చేశారు. సరస్వతి మంత్ర హవనం, హోమం వంటి క్రతువులతో ఆలయ ప్రాంగణమంతా మంత్రోచ్ఛారణలతో ప్రతిధ్వనించింది. అటు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని త్రిశక్తి పీఠంలోనూ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
కొలనుభారతికి శ్రీశైలం పట్టువస్త్రాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. వసంత పంచమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, చైర్మన్ రమేష్ నాయుడు తదితర ప్రముఖులు అమ్మవారికి సమర్పించారు. చదువుల తల్లికి జరిగిన ప్రత్యేక పూజలు, అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏఈఓ ఫణీంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ జ్ఞాన ప్రదాయిని నామస్మరణతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుకున్నాయి.
