
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి, ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలను మార్మోగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
శ్రీశైలం: భక్తుల కోర్కెలు తీర్చే మల్లికార్జునుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో ప్రతిధ్వనిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.మహాశివరాత్రి రోజు ఏ కోరికతో స్వామిని దర్శించుకుంటామో, అది కచ్చితంగా నెరవేరుతుందని మా నమ్మకం అని శివస్వాములు పేర్కొన్నారు. శివమాల ధరించి ఏళ్ల తరబడి దర్శనానికి వస్తున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
వేములవాడ: రాజన్నకు కోడె మొక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భారీగా చేరుకుని 'కోడె మొక్కులు' చెల్లించుకున్నారు.ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కాళేశ్వరం: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్నారు.గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నది మాతల్లికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ముక్తీశ్వర స్వామికి మారేడు దళాలతో అభిషేకాలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, కీసరగుట్ట వంటి క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్,
పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.ఈ పవిత్ర పర్వదినం ప్రజల్లో ప్రేమ, సామరస్య భావాలను పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాలని వారు ఆకాంక్షించారు.మహాశివరాత్రి పండుగ చీకటిపై వెలుగు సాధించిన విజయానికి చిహ్నమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, పరమశివుడు జ్ఞానం, ధైర్యం, కరుణకు స్వరూపమని కొనియాడారు. తెలంగాణలోని పురాతన శివాలయాల వైభవం రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. లోకకళ్యాణం కోసం, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
ఫసల్ వాడిలో 1008 నదుల జలలింగ అభిషేకం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడి గ్రామంలో నిర్వహించిన జలలింగాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక 1008 నదుల నుంచి సేకరించిన తీర్థజలాలతో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి మార్గదర్శకత్వంలో జరిగిన గరక పూజలో మంత్రి స్వయంగా నదీజలాలతో నిండిన బిందెను తలపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేసి జలలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం జలలింగం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది శివభక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు.
విజయవాడలో ఆధ్యాత్మిక శోభ
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. పవిత్రమైన కృష్ణా నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజామున నుంచే ఘాట్లకు చేరుకున్నారు. భక్తులు నదిలో స్నానం చేసి శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భగవంతుని ఆశీస్సులు కోరుకున్నారు.
విజయవాడ నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, జాగరణలు నిర్వహించబడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ, ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని ఏర్పాట్లను ఏసీపీ దుర్గారావు పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక శివాలయ పూజారి ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు శివపార్వతుల కళ్యాణంతో కార్యక్రమాలు ముగిసాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ భక్తి గీతాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇక దేశవ్యాప్తంగా కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగిగాయి. అహ్మదాబాద్‌లోని మినీ సోమనాథ్ ఆలయం, రియాసిలోని ఆప్ శంభు మహాదేవ్ ఆలయం, అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయంలలో ఆర్తి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఘనంగా ప్రార్థనలు చేశారు.
మహాశివరాత్రి పర్వదినం శివుడు–పార్వతి దివ్య కలయికను సూచిస్తూ దేశవ్యాప్తంగా భక్తి, ఆధ్యాత్మికతతో జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసాలు ఉండటం, రాత్రంతా జాగరణ చేయడం, శివారాధన చేయడం ద్వారా శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తి వాతావరణంతో కళకళలాడుతున్నాయి.
