Let's talk: editor@tmv.in
తెలుగు రాష్ట్రాలలో తుఫాను తాకిడి

తెలుగు రాష్ట్రాలలో తుఫాను తాకిడి

Pinjari Chand
30 అక్టోబర్, 2025

మొంథా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి ఆర్థిక,రవాణా వ్యవస్థ, జనజీవనం అతలాకుతలం అయ్యింది. రాకాసి ఆలల ధాటికి తీరం అల్లకల్లోలంగా మారింది. పల్లెలు, పట్నాలు అని తేడా లేకుండా చిగురుటాకులా వణికిపోయాయి. కాలనీలు,ఇళ్లు నీటమునిగాయి. వాగులు,వంకలు, నదులు పొంగిపోర్లాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. పంటలు నేలమట్టం అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాలు బీభత్సమైన గాలుల ధాటికి జడిసిపోయాయి. కుండపోత వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్తంభించిపోయాయి. సహాయక బృందాలు, ఆయా ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు ముమ్మరం చేశాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రులు, అధికారులు,నాయకులు లోతట్టు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలకు మేం ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. ఒడిశా, కర్ణాటక, తమిళనాడులోనూ తుఫాన్ ప్రభావం ఏర్పడింది.

18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం

ఏపీలో మొంథా తుపాను ప్రభావం 249 మండలాలపై పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. వాటిని తొలగించేందుకు 290 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని బోట్లలో రక్షించేందుకు 60 మంది పనిచేస్తున్నారు. కాగా 3,175 మంది గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కడప తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం తుఫాన్ తీరం దాటడంతో బుధవారం సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల మీదుగా హెలికాప్టర్‌లో పర్యటించి ఏరియల్ సర్వే చేశారు. బాపట్ల, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే సాగింది. తదనంతరం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ వల్ల కలిగిన నష్టంపైనా, ప్రస్తుతం తీసుకోవాల్సిన పరిస్థితులపైనా ఆర్టీజీఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ, ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు .

రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు.

అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

దెబ్బతిన్న రహదారులు.. ధ్వంసమైన కల్వర్టులు.. నేలకొరిగిన పంటలు

రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి... 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. 59 వేలకు పైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయారు. 42 పశువులు చనిపోయాయి. రాష్ట్రంలో 14 బ్రిడ్జిలు, కల్వర్టులు, 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతినడంతో రూ.1,424 కోట్ల నష్టం వాటిల్లింది. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు సీఎం కు వివరించారు. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. 2,130 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని తెలిపారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. కడప జిల్లాలో పోతులూరి వీర బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది. గుండ్లకమ్మలో పడవ బోల్తాపడి ఆరుగురు గల్లంతయ్యారు.

మంత్రుల సమీక్షలు

మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సి, సిఈలు, ఎస్ఈ లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతం లో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరింది.దీంతో వెలిగొండ 2 టన్నెల్స్ లోకి 9కి. మీ మేర లోనికి నీరు ప్రవేశించింది. అందులో పని చేస్తున్న 250 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. టన్నెల్ లో డీ వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. గుండ్లకమ్మ పరీవాహ ప్రాంత అధిక వర్షాలతో అవుట్ ఫ్లో ను 70 వేల క్యూసెక్కుల నుండి లక్ష క్యూసెక్కులకు విడుదల చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నామన్నారు.

గుండ్లకమ్మ వరద నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఒడిశా రాష్ట్రం లోని వరదలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంద్ర లోని బహుదా పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలని తెలిపాం. రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

బాపట్ల జిల్లా, చీరాల నియోజవర్గం, వాడరేవు గ్రామంలో సముద్రతీర ప్రాంత ప్రజలతో కలిసి వారి సమస్యలను మంత్రి కొలుసు పార్థసారథి తెలుసుకున్నారు.

తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అందరూ సహకరించాలి

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం ఉంటుందని, సహయక చర్యల్లో అధికారులకు అందరూ సహకరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. ప్రజలు ఈ మూడు రోజులపాటు బయటకు వెళ్లొద్దని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలిన సూచించారు.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్, పోలీసులు

తుపాను పునరుద్ధరణ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. నిజాంపట్నం నుంచి రేపల్లె రొడ్డు మార్గంలో పడిన చెట్లను రెస్క్యూ బృందాలు తొలగించాయి. అనకాపల్లి, మచిలీపట్నం మంగినపూడి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తీసేసి, రోడ్డును క్లియర్ చేశారు. పోలీసులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గోన్నారు.

తుపాను నిరాశ్రయులకు పార్టీలకతీతంగా సహాయం చేశారు. మెుంథా తుఫాను ప్రభావం వల్ల నిరాశ్రయలకు, నిరుపేదలకు మాజీ ఎంపీ వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ సహాయం అందించారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర సుమారు 200మంది పేద ప్రజలకు దుప్పట్లు, రగ్గులు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

సహాయక చర్యల్లో డ్రోన్లు

మొంథా తుఫాను సహయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతోన్న వ్యక్తిని డ్రోన్ ద్వారా అధికారులు గుర్తించి వెంటనే కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల కొట్టుకుపోతున్న పశువులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఒడ్డుకు చేర్చారు.

తెలంగాణలోనూ

మొంథా తుఫాను కారణంగా తెలంగాణ వణికిపోతోంది. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరం దాటిన తర్వాత, మొంథా తుఫాను అల్పపీడనంగా మారి తెలంగాణపైకి దూసుకువస్తోంది. దీంతో అనేక జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.

తెలంగాణలో 16 జిల్లాలకు మొంథా తుపాను ముప్పు

మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, యాదాద్రి,పెద్దపల్లి పలు జిల్లాలకు వరద ముప్పు ఉన్నట్లు తెలిపిన వాతావరణశాఖ.అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ (రూరల్/అర్బన్) జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో పాఠశాలలకు కూడా బుధవారం నుంచి రేపటి వరకు సెలవులు ప్రకటించబడ్డాయి.

రైల్వే ట్రాక్‌లు జలమయం

మొంథా' తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ట్రాక్‌లు వరద నీటితో పూర్తిగా జలమయమయ్యాయి. భారీగా నీరు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు.అలాగే, రైలు ట్రాక్‌లపై నీరు నిలవడంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు.

హైదరాబాద్‌లో నీటమునిగిన వీధులు,రోడ్లు

బుధవారం ఉదయం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అనేక ప్రాంతాలు నీటమునిగి, రహదారి రవాణా అంతరాయానికి గురయ్యాయి.హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, దీంతో రహదారులపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావంతో తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, తుఫాను ప్రభావం కారణంగా తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వచ్చే గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.మొంథా తుఫాను మంగళవారం రాత్రి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్యలోని నరసాపురం తీరానికి సమీపంలో రాత్రి 11:32 నుంచి 12:30 మధ్య భూభాగాన్ని తాకిందని, అనంతరం ఉత్తర–వాయవ్య దిశగా కదిలి బలహీనమై సైక్లోనిక్‌ స్టార్మ్‌గా మారిందని అమరావతిలోని వాతావరణశాఖ శాస్త్రవేత్త డా. కరుణసాగర్ తెలిపారు. మొత్తం మీద, మొంథా తుఫాను ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రవాణా అంతరాయాలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

దేవరకొండ గురుకుల పాఠశాలలోను చుట్టు ముట్టిన‌ వరద

నల్గొండ జిల్లా దేవరకొండలోని గురుకుల పాఠశాలలో వరదనీరు ప్రవేశించడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు. దేవరకొండ మండల పరిధిలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వలన తాత్కాలిక నీటిమునిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ, గురుకుల పాఠశాలలో పెద్దగా నష్టం జరగలేదని సమాచారం. విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారులు నిరంతర ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం నగరంలో రహదారి రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా రాయదుర్గం, గచ్చిబౌలీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల కదలిక మందగించింది.రాయదుర్గం మెట్రో స్టేషన్‌ దగ్గర, ఐటీ కారిడార్‌ రోడ్లపై వర్షపు నీరు మునిగిపోవడంతో ట్రాఫిక్‌ సుమారు ఒక గంటకు పైగా నిలిచిపోయింది. వర్షపు నీరు రహదారులపై చేరడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు సిబ్బందిని మోహరించారు. రాయదుర్గం–మాదాపూర్, హైటెక్‌ సిటీ రోడ్లపై వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు.

తుఫాను తర్వాత ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

• విద్యుత్‌ తీగలు, పడిపోయిన చెట్లు లేదా నీటిలో మునిగిన వైర్లు దగ్గరికి వెళ్లకండి.

• విద్యుత్‌ సరఫరా తిరిగి వచ్చే ముందు, మినీ ట్రిప్ బాక్స్ లేదా మెయిన్ స్విచ్ ఆఫ్‌లో ఉందో లేదో చెక్ చేయండి.

• ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడే ముందు టెక్నీషియన్‌ తనిఖీ చేయించండి.

• మరిగించిన నీరు మాత్రమే తాగండి.

• వర్షపు నీరు నిలిచిన రోడ్లపై వాహనం నడపకండి.

• తుఫాను తర్వాత జలుబు, వైరల్‌, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

తెలుగు రాష్ట్రాలలో తుఫాను తాకిడి - Tholi Paluku