
తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
భారతీయ సినీ సంగీత జగత్తులో, ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో తన మధుర గానంతో తరతరాలను అలరించిన తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె బుధవారం ఉదయం (అక్టోబరు 15)హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.
సంగీత ప్రస్థానం:
1928లో జన్మించిన బాలసరస్వతి, తన ఆరేళ్ల లేత వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) కార్యక్రమాల ద్వారా తెలుగు శ్రోతలకు తొలిసారిగా పరిచయమయ్యారు. 1936లో వచ్చిన 'సతీ అనసూయ' చిత్రంలో తొలి పాటను ఆలపించి, తెలుగులో మొట్టమొదటి నేపథ్య గాయనిగా చరిత్రలో నిలిచారు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ఆమె 2000కు పైగా పాటలు పాడారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమాకు లలిత సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. అలాగే, తొలి తెలుగు సోలో గ్రామ్‌ఫోన్ రికార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
వ్యక్తిగత జీవితం:
బాలసరస్వతి అసలు పేరు సరస్వతి దేవి. చిన్నప్పటి నుంచే పాటలు పాడటంతో అందరూ ఆమెను బాలసరస్వతి అని పిలవడం మొదలుపెట్టారు. 1936లో 'సతీ అనసూయ ధ్రువవిజయం' అనే బాలల చిత్రంలో ఆమె గంగ పాత్రలో కనిపించారు. అయితే, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం, నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన నటన అవకాశాలను వదులుకున్నారు. పాట అంటే తన ప్రాణమని అనేక ఇంటర్వ్యూలలో ఆమె చెప్పారు. దురదృష్టవశాత్తూ, వివాహం తర్వాత ఆమె పాటకు దూరమయ్యారు. మళ్ళీ 1974లో భర్త మరణానంతరం తిరిగి పాటలు పాడటం ప్రారంభించారు.
తీరని కోరిక:
"నా జీవితం ఓ అసంపూర్ణ కీర్తన. పాడుతూ పాడుతూ మధ్యలోనే ఆగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు. మరో జన్మంటూ ఉంటే గాయనిగానే పుడతాను. ఈసారి మాత్రం పెళ్లి, పాట.. ఈ రెండింటిలో ఏది కావాలని అడిగితే పాటే కావాలంటాను. పాటతోనే నా జీవితమంటాను" అని బాలసరస్వతి గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మాటలు సంగీతంపై ఆమెకున్న అపారమైన ప్రేమను, పాటకు దూరమవడం ఆమెకు కలిగించిన బాధను ప్రతిబింబిస్తాయి.
బాలసరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నటుడు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో, "సరస్వతి కన్నుమూశారని తెలిసి చింతించా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని పేర్కొన్నారు.
నటుడు బాలకృష్ణ సైతం బాలసరస్వతి మృతి తనను కలచివేసిందని అన్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటి, గాయనిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. బాల సరస్వతి దేవి చిన్ననాటి నుండే కళారంగంలో ప్రవేశించి 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయనిగా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళ సినిమాల్లో భక్త కుచేల, బాలయోగిని, తుకారాం వంటి చిత్రాల్లో చిన్నప్పుడే నటించారు. తెలుగు సినిమాల్లో మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా భాగ్యలక్ష్మి చిత్రంలో "థిన్నే మీద సిన్నోడ" పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారు. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆల్ ఇండియా రేడియోలో మొదటి 'లైట్ మ్యూజిక్' గాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 2 వేలకుపైగా పాటలు పాడి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయారు. బాలసరస్వతీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆమె పాటలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు అన్నారు.
