Let's talk: editor@tmv.in
తెలుగులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన హెడ్ కానిస్టేబుల్ స్వరూప

తెలుగులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన హెడ్ కానిస్టేబుల్ స్వరూప

Gaddamidi Naveen
8 జనవరి, 2026

తెలంగాణ పోలీస్‌ శాఖలో సాధారణ దర్యాప్తు, కోర్టు పత్రాలు అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి అనే ప్రామాణిక విధానానికి తాజాగా విరుద్ధంగా, సామాన్యులకు అర్థమయ్యేలా మాతృభాషలో అభియోగపత్రాలు దాఖలు చేసే ప్రయత్నం ప్రారంభమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఈ సరికొత్త అధ్యాయం మొదలుపెట్టారు.

సామాన్యుల కోసం సరికొత్త అడుగు

చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ రాకపోవడం వలన కేసు వివరాలను అర్థం చేసుకోవలేని సాధారణ ప్రజలకు కూడా స్పష్టత కల్పించాలనే భావన. 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులో కోర్టుకు సమర్పించడం ద్వారా ఆయన ఈ కొత్త ప్రయత్నాన్ని చాటుకున్నారు. ఈ చర్యతో కేసు వివరాలు ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతున్నాయి, అలాగే న్యాయ ప్రక్రియలో ప్రజల ఆకర్షణ పెరుగుతుంది. కేవలం నివేదికలు రాయడమే కాకుండా, ఒక మిస్సింగ్ కేసును అత్యంత వేగంగా ఛేదించి, తప్పిపోయిన తల్లిబిడ్డలను క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించి తన మానవీయతను చాటుకున్నారు.ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఈ తెలుగు ఛార్జ్ షీట్ దాఖలు ప్రక్రియలో ఏసీపీ శంకర్ రెడ్డి ప్రోత్సాహంతో, మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగపత్రాలను సమర్పించారు. న్యాయస్థాన పత్రాల్లో మాతృభాషను ఉపయోగించడం వల్ల న్యాయ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఉన్నతాధికారులు అభినందించారు.

డీజీపీ చేతుల మీదుగా ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసి, ఆదర్శంగా నిలిచినందుకు గాను స్వరూప గారికి ఉన్నతస్థాయిలో గుర్తింపు లభించింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. స్వరూప చేసిన ఈ ప్రయత్నం పోలీసు శాఖలో ఒక గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని పోలీస్ స్టేషన్లలో తెలుగులో దర్యాప్తు నివేదికలు వచ్చేలా ఈ ఘటన స్ఫూర్తినిస్తోంది.

తెలుగులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన హెడ్ కానిస్టేబుల్ స్వరూప - Tholi Paluku