
తెలిసిన వాళ్లే కామరాక్షసులు
అత్యంత క్రూరమైన నేరం. అమాయకమైన చిన్నారులపై నరమృగాలు చూపిస్తున్న పాశవికత్వం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ అమానుషాలకు పాల్పడుతున్నవారు ఎవరైనా అన్యులు కాదు. ఆ పిల్లలకు తెలిసినవాళ్లే..! అంటే బంధువులు, స్నేహితులు, పొరుగువారు. రక్షణ ఇవ్వాల్సినవాళ్లు రాక్షసుల్లా మారి వారి చిన్ననాటి వెలుగుని చీకట్లోకి నెట్టేస్తున్నారు. నమ్మకం అనే బంధాన్ని తునాతునకలు చేసేస్తున్నారు. ఇది కేవలం నేరం కాదు, మానవత్వం మీద మచ్చ. చిన్నారుల కన్నీరు ఎండకముందే మరో చిన్నారి బలవన్మరణం చెందుతున్న వాస్తవం మనం ఎంతగా విఫలమవుతున్నామో చెప్పేస్తోంది.
భారత్‌లో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బాధితులకు తెలిసిన వారే నేరస్థులుగా మారుతున్న దృశ్యం మరింత భయానకంగా ఉంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 40,434 చిన్నారులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటిలో 97 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు బంధువులు, స్నేహితులు లేదా పొరుగువారు కావడం మరింత కలవరపరుస్తోంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 4,600 కేసులు నమోదవ్వగా, మధ్యప్రదేశ్‌లో 3,866, ఉత్తరప్రదేశ్‌లో 3,728, తమిళనాడులో 3,407, కర్ణాటకలో 3,101, గుజరాత్‌లో 2,279 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఓడిశా, ఝార్ఖండ్, త్రిపురా, మిజోరాం వంటి 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే ప్రతి కేసులోనూ తెలిసిన వారే నేరస్థులుగా ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులో 99.9 శాతం.. కర్ణాటక, తెలంగాణలో 99.8 శాతం కేసులు పరిచయస్థులే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తం మీద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 99 శాతం కంటే ఎక్కువ కేసులు ఈ కేటగిరీలో ఉన్నాయి.
ఇక 2017లో 17,557 కేసులు ఉండగా, 2020లో 28,065కి పెరిగాయి. 2023 నాటికి ఇది 40,434కి చేరింది. కేవలం కేసుల సంఖ్యే కాదు, నేరస్థులు తెలిసిన వారే అన్న శాతం కూడా పెరుగుతూనే వచ్చింది. 2017లో 93.6 శాతం ఉండగా, 2020లో 96 శాతం, 2023 నాటికి 96.6 శాతం వరకు పెరిగింది.
ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు వంటి వ్యవస్థలు ఉండే సరికి కూడా కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారణం ఏంటంటే, నేరస్థులు కుటుంబం, సమాజం లోపలే దాగి ఉండడం. బయటవారి నుంచి కాకుండా, ఇంటి గోడల మధ్యనుంచే, పరిచయం ఉన్నవారి చేతుల మీదుగా పిల్లలు బాధపడటం ఈ సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది.
ఈ గణాంకాలు చూస్తే, చట్టాలు మాత్రమే కాకుండా, సామాజిక అవగాహన, కుటుంబ స్థాయిలో సంరక్షణ, పిల్లల భద్రతపై దృష్టి మరింత పెరగాల్సిన అవసరం స్పష్టమవుతోంది. చిన్నారులపై నేరాలను అరికట్టాలంటే న్యాయవ్యవస్థ వేగంగా స్పందించడంతో పాటు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
