
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్
తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన సంఘటన నవంబర్ 14 శుక్రవారం వెలుగు చూసి కలకలం రేపింది. సాధారణంగా న్యాయవ్యవహారాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌ను సందర్శించే వారు, అకస్మాత్తుగా తెలియని బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అవుతుండటంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెబ్‌సైట్‌ను సందర్శించిన పలువురు వినియోగదారులు ఈ అనుమానాస్పద రీడైరెక్షన్‌ను గమనించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
ప్రాథమిక సమాచారం మేరకు, హైకోర్టు సర్వర్‌లోకి దుర్వినియోగ ప్రయత్నం జరిగినట్టు సూచనలు లభించాయి. వినియోగదారుల ట్రాఫిక్‌ను మార్చి, బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు దారి మళ్లించేలా కోడ్ చొప్పించిన అవకాశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. సర్వర్ లాగ్‌లు, సైట్ బ్యాక్‌ఎండ్ యాక్టివిటీ, ఐపీ అడ్రస్ వివరాలు వంటి సాంకేతిక అంశాలను విశ్లేషిస్తున్నారు. వెబ్‌సైట్‌లోకి చొరబడిన వారు ఎలాంటి డేటాను యాక్సెస్ చేశారా? లేక కేవలం రీడైరెక్ట్ చేయడానికే ఈ చర్య చేపట్టారా? అన్న విషయాలను అధికారులు స్పష్టీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికారులు సర్వర్ భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా,అన్న అంశాలను లోతుగా వెతుకుతున్నారు.హైకోర్టు వంటి కీలక సంస్థ వెబ్‌సైట్‌పై జరిగిన ఈ దాడి, ప్రభుత్వ శాఖల డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.అంతేకాక, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా సర్వర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకునేలా అధికారులను సూచించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెబ్‌సైట్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
