
తెలంగాణ స్పీకర్, దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా హైకోర్టు స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలతో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. అయితే, మార్చి 11న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లోని ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు.
స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోరారు. గతంలోనే హైకోర్టు ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు విధించిన నేపథ్యంలో, తాజా నోటీసులు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
