Let's talk: editor@tmv.in
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ

Shaik Mohammad Shaffee
21 నవంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణుడు, అనలాగ్ ఏఐ సంస్థ సీఈవో అలెక్స్ కిప్‌మాన్ గురువారం భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌లో కైనెట్‌, హోలోలెన్స్ వంటి విప్లవాత్మక టెక్నాలజీలను సృష్టించిన ఘనత కిప్‌మాన్‌కు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కిప్‌మాన్ మధ్య జరిగిన ఈ భేటీ, తెలంగాణలో అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పట్టణ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది.

అలెక్స్ కిప్‌మాన్ నేతృత్వంలోని అనలాగ్ ఏఐ సంస్థ, తన అత్యాధునిక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ల సహాయంతో తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.ముఖ్యంగా, హైదరాబాద్‌లో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మెరుగుపరచడం, భారీ వర్షాల వల్ల వచ్చే పట్టణ వరదలను నియంత్రించడం, ముందుగా అంచనా వేయడం, భవిష్యత్తులో వచ్చే వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలను ముందే అంచనా వేయడానికి సహాయం చేయడం వంటి అంశాల్లో సహకారానికి అనలాగ్ ఏఐ ఆసక్తి చూపింది. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు రాష్ట్రానికి అధిక ప్రభావం చూపే పరిష్కారాల కోసం తాము కృషి చేస్తామని అనలాగ్ ఏఐ హామీ ఇచ్చింది.

అంతేకాకుండా, ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్గాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లలో అనలాగ్ ఏఐ 'ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్'ను అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి, కిప్‌మాన్ చర్చించారు. సాంకేతిక ఏకీకరణ అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. 'ఫిజికల్ ఇంటెలిజెన్స్' అంటే, వాస్తవ ప్రపంచం నుంచి సెన్సార్లు, కెమెరాల ద్వారా డేటాను సేకరించి, దాన్ని వేగంగా విశ్లేషించి, సమస్యలను పరిష్కరించడానికి లేదా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే సాంకేతికత. ఈ సహకారం ద్వారా తెలంగాణలో పట్టణ పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింత స్మార్ట్‌గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలా ఉపయోగిస్తారు?

అనలాగ్‌ ఏఐ ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్’ తెలంగాణ ఫ్యూచర్ సిటీ ’ ప్రాజెక్టులో నగరాన్ని రియల్ టైమ్‌లో అర్థం చేసుకుని, ముందస్తు అంచనాలు వేసి, ఆటోమేటిక్ గా స్పందించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ సిస్టమ్స్ సహాయంతో ట్రాఫిక్, నీటి సరఫరా, శక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణ వంటి కీలక సేవలను నిరంతరం పర్యవేక్షించి, సమస్యలు ఉత్పన్నం కాకముందే పరిష్కరించగలిగే తెలివైన అర్బన్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు అమలులోకి వస్తాయి. రహదారులు, వంతెనలు, భవనాలు వంటి ముఖ్య మౌలిక వసతుల ఆరోగ్యాన్ని సెన్సర్ల ద్వారా పరిశీలించడం కూడా ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది.

ఏఐ సిటీ

లో ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ మరింత సమగ్ర పాత్ర పోషిస్తాయి. ట్రాఫిక్, భద్రత, పర్యావరణం, నీటి వ్యవస్థలు వంటి నగర కార్యకలాపాలన్నీ ఒకే ప్లాట్‌ఫార్మ్‌పై ఏకీకృతమై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ నిర్ణయాలు తీసుకునే స్మార్ట్ అర్బన్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించవచ్చు. మిక్స్‌డ్ రియాలిటీ, హోలోలెన్స్‌ వంటి ఆధునిక విజువలైజేషన్ టూల్స్‌తో నగర ప్రణాళికను వేగవంతంగా, ఖచ్చితంగా రూపొందించవచ్చు. మొబిలిటీ రంగంలో ఏఐ ఆధారిత డైనమిక్ ట్రాఫిక్ సిగ్నల్స్‌, రూట్ ఆప్టిమైజేషన్‌, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిమాండ్ ప్రిడిక్షన్ వంటి పరిష్కారాలు నగర రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుతాయి.

మూసీ నది తీరం అభివృద్ధి

లో ఈ సిస్టమ్స్ ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. నదిలోని నీటి మట్టం, ప్రవాహ వేగం, వర్షపాతం డేటాను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, ఏ ప్రాంతాల్లో వరద ప్రమాదం ఏర్పడవచ్చో ముందుగానే అంచనా వేయగలుగుతాయి. భారీ వర్షాల సమయంలో ప్రమాద సూచనలు పంపడం, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు సూచించడం వంటి కీలక సామర్థ్యాలు ఈ టెక్నాలజీ ద్వారా లభిస్తాయి. అదనంగా, నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ కాలుష్యం పెరిగినప్పుడు సంబంధిత విభాగాలకు వెంటనే అలర్ట్ పంపడం, నది పరిసరాల్లోని జీవవైవిధ్యాన్ని రక్షించడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అలెక్స్ కిప్‌మాన్‌ను తెలంగాణ రాష్ట్రం నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ఆహ్వానించారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనుంది.