
తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు: సీఎం రేవంత్‌రెడ్డి
శాసనసభ స్పీకర్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రజాప్రతినిధులు మధుపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ విషయంపై సీఎం కూడా స్పందించారు. అత్యంత హేయంగా, అవమానకరంగా మాట్లాడటాన్నితీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణ పరిధిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడిన అంశాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సభలో ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి స్పందించారు. స్పీకర్‌పై దుర్భాషలాడిన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది అందరికీ జరిగిన అవమానం
‘ఇది అత్యంత తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతిపై ఇంత అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. స్పీకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు.. అందరికీ జరిగిన అవమానం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌పై అత్యంత హేయంగా మాట్లాడిన సభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని శాసనమండలి చైర్మన్‌ను కోరాలని సూచించారు. ఈ ఘటన తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి గాయమని, నాలుగు కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు అతీతంగా ఖండించాలి
అడ్డగోలుగా ఏది మాట్లాడినా చెల్లుతుందని భావించే వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ఒక శాసనసభ్యుడికి సంబంధించిన సమస్యగా చూడకూడదని, రాజకీయాలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్పీకర్ తల్లిని అవమానించేలా మాట్లాడటం అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. మనందరం ముక్తకంఠంతో ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలని రేవంత్‌రెడ్డి అన్నారు.
‘ఇకపై సభల పట్ల గౌరవం ఉండదు’
భారతదేశ చట్టసభల చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన సంఘటన ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతటి దుర్భాష ఎవరూ ఉపయోగించలేదన్నారు. ఇలాంటి సంప్రదాయాన్ని క్షమించి వదిలేస్తే భవిష్యత్‌లో చట్టసభల పట్ల ఏమాత్రం గౌరవం ఉండదని హెచ్చరించారు. దుర్మార్గమైన భాషను ఉపయోగించడం బాధాకరమని, సంబంధిత సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకుని అనర్హుడిగా ప్రకటించడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు: తాత మధు
తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం ఎదుట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన అంశాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ ప్రాంగణం వద్ద జరిగిన దాడి ఘటనను తీవ్రంగా పరిగణించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాత మధు కోరారు.
