
తెలంగాణ రైతుల గోస వినిపించండి! బోరబండలో రైతుల ప్రచారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకున్న వేళ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పరిధిలో రైతులు గుమిగూడి, తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మెడలో పచ్చ కండువాలు వేసుకున్న రైతులు రోడ్డు పక్కన నిలబడి నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.యూరియా కోరత, పంట బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ, పంట కొనుగోలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే తాము తీవ్రంగా నష్టపోయామని వారు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో 758 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతులు వారి చేతుల్లో ఉన్న పోస్టర్లులను ప్రజలకు చూపిస్తున్నారు.ఈ సందర్భంగా రైతులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని బహిరంగంగా వేడుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ బాధను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని రైతులు తెలిపారు.
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.రైతులందరి పక్షాన పదిమంది ఎన్నికల బరిలో నిలిచారు. మాటతప్పిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలనే తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని పలువురు రైతులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి తమకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలన్నారు.
