Let's talk: editor@tmv.in
తెలంగాణ రైతుల కోసం మూడవ డిస్కం ఏర్పాటు

తెలంగాణ రైతుల కోసం మూడవ డిస్కం ఏర్పాటు

Gaddamidi Naveen
13 మార్చి, 2026

తెలంగాణ విద్యుత్ రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడవ విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీడీసీఎల్) ను అధికారికంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్‌పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనే రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. వీటి సరసన ఇప్పుడు మూడవ డిస్కంగా టీజీఆర్‌పీడీసీఎల్ ను ఏర్పాటు చేశారు. బుధవారం, మార్చి 11, 2026న ప్రభుత్వం ఈ సంస్థను అధికారికంగా ప్రకటించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, టీజీఎస్‌‌‌‌‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలోని బీ బ్లాక్‌లో టీజీఆర్‌పీడీసీఎల్ యొక్క రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ కొత్త సంస్థ పరిధిలో రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు / మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు కూడా టీజీఆర్‌పీడీసీఎల్ ఆధీనంలోకి రానున్నాయి. అంతేకాకుండా ఎల్‌టీ VI-బీ కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు కూడా ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి.

వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా సేవల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.ఈ కొత్త సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీను ప్రభుత్వం నియమించింది. ఆయన గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.

అలాగే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి. తిరుపతి రెడ్డి, పి. కృష్ణ రెడ్డి, వి. మోహన్ రావు, డా. ఎన్. నరసింహులులను టీజీఆర్‌పీడీసీఎల్ పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త సంస్థ ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగి, రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

తెలంగాణ రైతుల కోసం మూడవ డిస్కం ఏర్పాటు - Tholi Paluku