
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అమలు ప్రారంభించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విజన్ అమలులో ప్రతి అంశాన్ని వెంటనే కార్యరూపంలోకి తీసుకురావాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ అభివృద్ధికి మార్గదర్శకమని, అది కేవలం ప్రచార పత్రం కాదని స్పష్టంగా చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా అన్ని శాఖలు తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
డిసెంబర్ 9న విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ డాక్యుమెంట్ ద్వారా 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని సీఎం గుర్తు చేశారు. ఈ లక్ష్య సాధనలో అధికారుల పనితీరు కీలకమని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్ని శాఖల కార్యదర్శుల పనితీరును ప్రభుత్వం సమీక్షిస్తుందని, ప్రతి నెలా వారు తమ పనితీరు నివేదికలను ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు పూర్తి బాధ్యతతో, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆయన సూచించారు. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ-ఫైలింగ్ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇకపై కాగితాల ఫైళ్లతో తిరిగే పరిస్థితి ఉండకూడదని, అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరగాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. వీరందరి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర జాబితాను జనవరి 26లోగా ప్రధాన కార్యదర్శికి అందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగరాదని సీఎం అన్నారు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను జనవరి 26లోగా ఖాళీ చేసి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే, ఖాళీ స్థలాలను గుర్తించి సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులను అన్ని శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతవరకు వాస్తవంగా అమలవుతున్నాయన్న అంశంపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను కార్యరూపంలోకి తీసుకువెళ్లేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
