Let's talk: editor@tmv.in
తెలంగాణ రైజింగ్ విజన్–2047 సిటిజన్ సర్వే..!

తెలంగాణ రైజింగ్ విజన్–2047 సిటిజన్ సర్వే..!

Gaddamidi Naveen
16 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' సిటిజన్ సర్వే (పౌర సర్వే) గురించి తెలుసుకుందాం.

ఈ సర్వే ముఖ్య ఉద్దేశం, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారో తెలుసుకోవడం. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం పొంది వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సమగ్ర విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి ఈ సర్వేను ప్రారంభించారు.

సర్వే ముఖ్య ఉద్దేశం

లక్ష్యం 2047: రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాబోయే 20 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను సేకరించడం. ఈ విజన్ డాక్యుమెంట్‌ను కేవలం విధాన పత్రంగా కాకుండా, తెలంగాణ ప్రజలందరి ఉమ్మడి స్వప్నంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పౌరుల భాగస్వామ్యం: రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు ప్రజలే కాబట్టి, ప్రతి పౌరుడి ఆలోచనలు, స్వరం ఈ డాక్యుమెంట్‌లో ప్రతిబింబించేలా ఈ సర్వేను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

సర్వే వివరాలు

ప్రారంభం, గడువు ఈ సర్వే అక్టోబర్ 10, 2025 న ప్రారంభమైన ఈ సర్వే, అక్టోబర్ 25, 2025 వరకు కొనసాగనుంది. ఇందులో యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వృద్ధులు ఎన్‌ఆర్‌ఐలు సహా ప్రతి పౌరుడు ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

భాషలు: సర్వే ప్రశ్నావళి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే సర్వే సమయం ఈ సర్వే పూర్తి చేయడానికి కేవలం 5-6 నిమిషాలు మాత్రమే పడుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఆన్‌లైన్ లింక్: పౌరులు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. (http://www.telangana.gov.in/telanganarising/) తెలంగాణ రైజింగ్ విజన్–2047” పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణను అభివృద్ధి, సాంకేతికత, సామాజిక న్యాయం, వ్యవసాయం, విద్య మరియు పర్యావరణ రంగాల్లో అత్యున్నత స్థాయికి చేర్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల సూచనలు, అభిప్రాయాలు ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఆధారంగా ఉపయోగించబడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.

సర్వేలోని ముఖ్యాంశాలు

• స్థానిక సంస్థల బలోపేతానికి అవసరమైన నిధులు, అధికారాలు... సమీప ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు...

• గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అందించాల్సిన అధునాతన సేవలు

• వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు

• తెలంగాణ ఆర్థిక వృద్ధిని 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడంలో భాగంగా.. ఉద్యోగావకాశాలు కల్పించడానికి నిర్వహించాల్సిన కోర్సులు, ఔత్సాహిక స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు

• వ్యవసాయ అనుబంధరంగాల్లో నూతన ఆవిష్కరణలు

• ఏఐ, రోబోటిక్స్, ఐటీఐలో నైపుణ్య ఆధారిత కోర్సులు, అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం మొదలైనవి.

తెలంగాణ రైజింగ్ విజన్–2047 సిటిజన్ సర్వే..! - Tholi Paluku