Let's talk: editor@tmv.in
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Shaik Mohammad Shaffee
26 నవంబర్, 2025

డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025” కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఈ సదస్సుతో పాటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన దార్శనిక పత్రం “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అంశాలపై వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

మంగళవారం (నవంబర్ 25) నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు. ఈ వరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అంశాల వారిగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

నవంబర్ 25న మంగళవారం రోజు జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లపై చర్చించారు.

నవంబర్ 26న (నేడు) లాజిస్టిక్స్, సమావేశాల సమన్వయం వంటి అంశాలపై సమీక్ష ఉంటుంది. ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారు. నవంబర్ 27న మౌలిక వసతులు, అభివృద్ధిపై చర్చ జరుగుతుంది. ఈ రోజు జరిగే సమీక్షలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు.

నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విద్య, యువజన సంక్షేమంపై సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సంబంధిత అధికారులు పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పర్యాటక అభివృద్ధి, దేవాలయ పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలపై సమీక్ష జరుగుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సంబంధిత అధికారులుతో కలిసి సీఎం సమీక్ష నిర్వహిస్తారు.

నవంబర్‌ 29న వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ)పై సమీక్ష జరుగుతుంది. సాయంత్రం 4 గంటల సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సంబంధిత అధికారులు హాజరవుతారు. సాయంత్రం 6 గంటల సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొంటారు. ఇక చివరి రోజు నవంబర్ 30న ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహతో సహా ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులంతా పాల్గొంటారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - Tholi Paluku